అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి దుర్మరణం

అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి దుర్మరణం

07-12-2017

అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి దుర్మరణం

హైదరాబాద్‌ నగరంలోని కుత్బుల్లాపూర్‌కు చెందిన నాగతులసీరామ్‌ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నాగ తులసీరామ్‌ వాటర్‌బర్రీలో ఉంటూ బ్రిడ్జిపోర్ట్‌ యూనివర్సిటీలో ఎం.ఎస్‌. చదువుతున్నాడు. కనెక్టికట్‌ రాష్ట్రం షెల్‌టన్‌ సిటీలో ఈ ప్రమాదం జరిగింది. కారు పాడవడంతో కాలిబాటపై నడుచుకుంటూ తులసీరామ్‌ వెళుతుండగా, తన కారుపై అదుపు కోల్పోయిన ఓ మహిళ వేగంగ అతన్ని ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. బుధవారం ఉదయం నగరలోని సూరారం కాలనీలో తండ్రి జాకబ్‌కు ప్రమాద విషయాన్ని చెప్పారు. తన కుమార్తెకు ఇక అండ ఎవరంటూ ఆ తండ్రి కన్నీరు మున్నీరవడం స్థానికులకు కలిచివేసింది. పిల్లల చిన్నతనంలో వారి తల్లి చనిపోగా, బిడ్డలకు అన్నీతానై పెంచిన ఆ తండ్రి అప్పుచేసి మరి కొడుకును ఉన్నత విద్యకు విదేశాలకు పంపించారు. ఇటీవల రెండుసార్లు గుండెపోటుకు గురయ్యారు. శస్త్రచికిత్సకు కూడా అవకాశం లేదని, బతికినన్ని రోజులు మందులపైనే ఆధారపడాలని వైద్యులు సూచించారు. అయినా ఆ నాన్న గుండె చలించలేదు. విదేశాల్లో చదువుతున్న కొడుకు అండగా ఉంటాడన్న ధైర్యంతో బతుకుతున్న అతన్ని విధి కుంగదీసింది.