హ్యూస్టన్ లో జూన్ 29 నుంచి ప్రపంచ తెలంగాణ మహాసభలు

హ్యూస్టన్ లో జూన్ 29 నుంచి ప్రపంచ తెలంగాణ మహాసభలు

17-11-2017

హ్యూస్టన్ లో జూన్ 29 నుంచి ప్రపంచ తెలంగాణ మహాసభలు

అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో ప్రపంచ తెలంగాణ మహాసభలను టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో వచ్చే ఏడాది జూన్ 29 నుంచి జూలై 1 వరకు మూడురోజులపాటు నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. హైదరాబాద్‌లో శుక్రవారం అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రెండేండ్లకోసారి చేపట్టే ఈ మహాసభలను ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తామని, వివిధ దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తమ సంస్కృతిని, సంప్రదాయాలను మరచిపోకుండా వాటి ఔన్నత్యాన్ని తెలుసుకునేలా, విదేశాల్లో మన సాంస్కృతిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రెండో మహాసభలను సినారే స్మృతిలో చేపడుతున్నట్టు చెప్పారు.

తెలంగాణ నుంచి ప్రతిభావంతులైన కళాకారులు, ప్రముఖ కవులు, రచయితలను కూడా ఆహ్వానిస్తున్నామని.. ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, చర్చలు నిర్వహిస్తామన్నారు. మహాసభలకు ముందుగా తెలంగాణలో పలు సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని అసోసియేషన్ కన్వీనర్ వెంకట్ మంతెన తెలిపారు. వచ్చేనెల 3న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రవాసీ ధూంధాం నిర్వహిస్తామని అసోసియేషన్ సాంస్కృతిక సలహాదారు పద్మజారెడ్డి తెలిపారు. సినారె స్మృత్యర్థం సినీ సంగీత విభావరి, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రమేశ్‌రెడ్డి, స్వరూప, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.