ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ

ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ

13-11-2017

ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ

ఫిలిప్పీన్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలిశారు. ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇండియా-ఆసియాన్‌ సదస్సు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్‌ చేరుకున్నారు. ఓ భారత ప్రధాని ఫిలిప్పీన్స్‌లో అడుగు పెట్టడం 36 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చివరిసారి ఫిలిప్పీన్స్‌లో పర్యటించారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మోదీ ఆ గడ్డపై కాలు మోపారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ట్వీట్‌ చేస్తూ, తాను ఫిలిప్పీన్స్‌ వెళ్తున్నానని, ఆసియాన్‌-ఇండియా, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఆసియాన్‌,ఇండియా-పసిఫిక్‌ ప్రాంతంలో బలమైన సంబంధాల కోసం భారత్‌ కట్టుబడి ఉందని ప్రధాని పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు ట్రంప్‌ సైతం తన వియత్నాం పర్యటన ముగించుకొని నేరుగా ఫలిప్పీన్స్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు కలుసుకొని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఆసియాన్‌ 50వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ సదస్సులో దక్షిణ చైనా సముద్రం వివాదం, అణుపరీక్షలతో ప్రపంచదేశాలకు తలనొప్పిగా మారిన ఉత్తర కొరియా గురించి చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియన్‌ ప్రధాని మాల్కమ్‌ టర్నబుల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.