ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరో అరుదైన రికార్డ్‌ను సృష్టించింది. అమెరికాలోని నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇండియన్ హెరిటేజ్ కమ్యూనిటీ నైట్ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. నవంబర్ 1న ఒహాయో రాష్ట్రంలోని క్వికెన్లోన్ అరేనాలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లెవెలెండ్ కావలీర్స్, ఇండియన్ పేసర్స్ మధ్య బాస్కెట్‌బాల్ పోటీ జరిగింది. అమెరికాలో ఎక్కువమంది ఆడే ఈ గేమ్‌ను చూసేందుకు 30వేలమంది హాజరయ్యారు. ఈ గేమ్ సందర్భంగా 30 వేల మంది ముందు భారతీయ సంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, భరతనాట్యాన్ని ప్రదర్శించి అహుతులను అలరించారు. అమెరికాలోని అన్నీ నేషనల్ ఛానల్స్ ప్రసారం చేసే ఈ?కార్యక్రమంలో భారతీయ నృత్య కళలను ప్రదర్శించడం ఇదే తొలిసారి. ఎన్బిఎ గేమ్ సందర్భంగా 'ఇండియన్ నైట్'ను నిర్వహించడం ద్వారా తానాకు అమెరికా వ్యాప్తంగా భారీ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తానా అధ్యక్షుడు సతీష్ వేమన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ నైట్ కార్యక్రమాన్ని ప్రదర్శించేందుకు తానా జాయింట్ ట్రెజరర్ అశోక్ బాబు కొల్లా ఎంతగానో కృషి చేశారు. తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ జే తాళ్ళూరి, నిరంజన్ శృంగవరపు, శ్రీనివాస్ సంగ, రవి సామినేని, రవి వడ్లమూడి, రామారావు పంగులూరి, సునీల్ పంత్ర తదితరులు కూడా ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.
ఈ సందర్భంగా జే తాళ్ళూరి మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని 50 రాష్ట్రాలకు తీసుకెళుతానని చెప్పారు. మన సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజేసేందుకు ఇదో చక్కని వేదిక అని తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు పేర్కొన్నారు. తానా ఇప్పటివరకు అమెరికాలో, భారత్‌లో చేసిన సేవా కార్యక్రమాలను ఎన్బిఎ ప్రశంసించింది. సంప్రదాయ నృత్య కళలను గురు శోభనారాయణన్, అమెకు సంబంధించిన నృత్య గీతాంజలి గ్రూపు ఆఫ్ డ్యాన్స్ బృంద సభ్యులు ప్రదర్శించారు.