అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

03-11-2017

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో వాల్‌మార్ట్‌ స్టోర్‌లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. కాల్పులు జరిపిన అనంతరం అక్కడి నుంచి కారులో పారిపోయిన దుండగుడు 47 ఏళ్ల స్కార్ట్‌ఓస్ట్రెమ్‌ను పద్నాలుగు గంటల తర్వాత  అధికారులు అరెస్టు చేశారు. సెక్యూరిటీ వీడియోల సాయంతో దుండగుడిని అధికారులు గుర్తించారు. ఈ కాల్పుల సంఘటన వెనుక ఎటు వంటి ఉగ్రవాద కోణం ఉన్నట్లు కనిపించడం లేదని థామ్టన్‌ పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు. కాల్పులు జరపడానికి వెనుక ఉద్ధేశం ఏమిటో తమకు తెలియదని, అయితే ఇది కచ్చితంగా అత్యంత దారుణమైన చర్య అని ఆ ప్రతినిధి చెప్పారు.

దుండగుడు తాపీగా స్టోర్‌లోకి ప్రవేశించిన తర్వాత హ్యాండ్‌గన్‌తో కాల్పులు జరపడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్టోర్‌ ఉద్యోగులు, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇద్దరుపురుషులు స్టోర్‌లోపోలే చనిపోగా, తీవ్రంగా గాయపడిన మరో మహిళ ఆసుపత్రిలో మరణించింది. డెన్వర్‌ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే షాపింగ్‌ సెంటర్‌లో ఈ వాల్‌మార్ట్‌ దుకాణం ఉంది. న్యూయార్క్‌లో ఐఎస్‌ఉగ్రవాదసంస్థ సానుభూతి పరుడు భారీ వాహనంతో పాదచారులను ఢీ కొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందిన ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.