ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ (ఐ.ఏ.ఎఫ్.సి) 20వ వార్షికోత్సవ వేడుకలు
Sailaja Reddy Alluddu

ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ (ఐ.ఏ.ఎఫ్.సి) 20వ వార్షికోత్సవ వేడుకలు

03-11-2017

ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ (ఐ.ఏ.ఎఫ్.సి) 20వ వార్షికోత్సవ వేడుకలు

ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ 20వ వార్షికోత్సవ వేడుకలు అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లో అక్టోబర్ 31, 2017 న అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు దేశం నలుమూలల నుండి 200 మందికి పైగా ఐ.ఏ.ఎఫ్.సి సంఘ ప్రతినిధులు ఉత్సాహoగా పాల్గొన్నారు.  ఉదయం 10 గంటలకు వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో భారత - అమెరికా దేశాల మధ్య ఉన్న ప్రస్తుత సంబంధభాంధవ్యాల పై వివిధ శాఖల అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు గంటకు పైగా జరిపిన సమావేశంలో సమీక్ష చేశారు. వీటిలో ముఖ్యంగా హెచ్ -1 బి వీసా, ఇమ్మిగ్రేషన్ సంబంధిత అంశాల పై ఐ.ఏ.ఎఫ్.సి సంస్థ అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర ప్రవాస భారతీయుల తరపున తమ ఆందోళనను వ్యక్తపరిచారు. సంస్థ ఛైర్మన్ డాక్టర్. కృష్ణారెడ్డి భారత సరిహద్దులలో పొంచి ఉన్న ఉగ్రవాదం పైన, డాక్టర్. సత్ గుప్త, రావు కల్వల తదితరులు ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు, సౌర శక్తి, రక్షణ, తదితర అంశాల పైన పలు ప్రశ్నలను లేవనెత్తారు.

మధ్యాహ్నం సెనేట్ బిల్డింగ్ లో ఒహయో సెనేటర్ షెర్డ్ బ్రౌన్ (డెమోక్రాట్), న్యూయార్క్ సెనేటర్ చక్ షూమర్ (డెమోక్రాట్), సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రహమ్ (రిపబ్లికన్) తదితరులు ఇరు దేశాలకు ఉపయోగ పడే అనేక ఒప్పందాల అమలులో కృషి చేస్తామని తమ పూర్తి మద్దతును ప్రకటించారు. 

సాయంత్రం జరిగిన విందు సమావేశంలో ఇండియా కాకస్ కో-చైర్ కాంగ్రెస్ సభ్యులు తులసి గాబర్డ్, జార్జ్ హోల్డింగ్ మరియు ఇతర కాంగ్రెస్ సభ్యులు డాక్టర్. అమీ బేరా, రాజా కృష్ణమూర్తి, ఫ్రాంక్ పాల్లోన్, కార్ట్ రైట్, ఎడ్ రాయిస్, కారోలిన్ మెలోని, టెడ్ పో, షీలా జాక్సన్ లీ, మాథ్యూ కార్ట్ రైట్లతో సహా 70 మందికి పైగా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు హాజరయి భారత అమెరికా దేశాల మధ్య సుదృఢమైన సంబంధాల కోసం పార్టీలకతీతంగా అమెరికా చట్ట సభలలో కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పంపిన సందేశాన్ని ఆదీష్ అగర్వాల్, అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ పంపిన సందేశాన్ని డాక్టర్. ప్రేమ్ రెడ్డి చదివి వినిపించారు. 

ఐక్యరాజ్య సమితిలో అమెరికా దేశపు రాయబారిగా ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఈ విందు సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరయి కీలకోపన్యాసం చేశారు. ఐ.ఏ.ఎఫ్.సి అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిధిని పరిచయం చేస్తూ అమెరికా రాజకీయాలలో నిక్కీ ఒక సంచలనం అని, గతంలో సౌత్ కరోలినా రాష్ట్ర గవర్నర్ గా ఎన్నో వేల ఉద్యోగాలను సృష్టించారని, ప్రస్తుతం అమెరికా రాయబారిగా ఐక్యరాజ్య సమితిలో తనదైన ప్రత్యేక ముద్రను వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. నిక్కీ హేలీ ప్రసంగిస్తూ ముందుగా మంగళవారం న్యూయార్క్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.   

ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణ ఆసియా ప్రాంతాలలో తీవ్రవాదాన్ని అరికట్టడంలో అమెరికా భారతదేశంతో కలిసి పని చేస్తుందన్నారు. అమెరికా దేశానికి పాకిస్తాన్ తో సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలను సహించేది లేదని గట్టిగా హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా దేశ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ల మధ్య గత జూన్ నెలలో జరిగిన భేటీలో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని అరికట్టి శాంతి భద్రతలు నెలకొల్పడంలో ఇరు దేశాలు కలిసికట్టుగా పని చేస్తాయని హామీ ఇచ్చ్చిన విషయాన్ని గుర్తు చేశారు. భారతదేశం అణు సామర్థ్యం కలిగిన దేశం అయినప్పటికీ బాధ్యత కలిగిన ప్రజాస్వామ్య దేశం కనుక భారతదేశాన్ని ఎవ్వరూ శంకించరని అన్నారు. అంతేగాక ఆర్ధిక, వాణిజ్య, సాంకేతిక రంగాలలో స్నేహ పూర్వకంగా ఇరు దేశాలకు ఉపయోగ పడే విధానాలతో ముందుకు సాగుతాయని అన్నారు. 

భారతీయ కుటుంబ విలువలతో కూడిన అనేక మిలియన్ల ప్రవాస భారతీయులు అమెరికా దేశ ప్రగతికి నిరంతరం తోడ్పడుతున్నారని, తాను కూడా భారత సంతతికి చెందినందు వల్ల గర్విస్తున్నాని, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ లాంటి సంస్థలు భారత అమెరికా దేశాల మధ్య ఉన్న సంబంధాలను గట్టిపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని ప్రశంసించారు. 

అనేక ఒత్తిడి పనుల్లో తీరిక లేకున్నా, ప్రత్యేక అభిమానం తో ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైనందుకు డాక్టర్. ప్రసాద్ తోటకూర రాయబారి నిక్కీ హేలీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఛైర్మన్ డాక్టర్. కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు అమర్నాథ్ గౌడలతో కలిసి ఆమెకు జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. 

డాక్టర్. కృష్ణారెడ్డి కాంగ్రెస్ సభ్యులు ఎడ్ రాయిస్, తులసి గాబర్డ్, జార్జ్ హోల్డింగ్స్ లకు జాతీయ సేవా అవార్డులు బహుకరించారు. డాక్టర్. ప్రేమ్ రెడ్డి, అవధేష్ అగర్వాల్, యెస్సెఫ్ బోడోన్స్కీ, అదీష్ అగర్వాల్ మరియు ప్రమీల కాజాలకు ఉత్తమ సేవా అవార్డులు అందజేశారు. 

ఉపాధ్యక్షులు అమర్నాథ్ గౌడ వందన సమర్పణ గావిస్తూ ఈ సమావేశాలకు రాయబారి నిక్కీ హేలీ ముఖ్య అతిధిగా హాజరు కావడంలో కీలక పాత్ర వహించిన అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూరకు, వేడుకలు ఘనంగా జరగడానికి సహకరించిన ఛైర్మన్ డాక్టర్. కృష్ణారెడ్డి, కార్యదర్శి సుబ్బారావు కొల్ల, కోశాధికారి తన్వీర్ ఆర్ఫీ, బోర్డు సభ్యులు మురళి వెన్నం, సతీష్ రెడ్డి, డాక్టర్. హరనాథ్ పొలిచెర్ల, కె. వి. కుమార్, రవి గౌడ, డాక్టర్. తారా రెడ్డి, ప్రమీల కాజా, మల్లిక్ బండ, బాల పళనిస్వామి, ఎం.సి రీటా కాస్బి, జోగేశ్వరరావు పెద్ధిబోయిన లాంటి అనేక మంది కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు, దాతలకు, అనేక రాష్ట్రాల నుండి విచ్చేసిన సంస్థ ప్రతినిధులకు తన కృతజ్ఞతలను తెలియజేశారు.

Click here for Event Gallery