అంబరాన్నంటిన తామా మహిళా సంబరాలు
MarinaSkies
Kizen

అంబరాన్నంటిన తామా మహిళా సంబరాలు

06-10-2017

అంబరాన్నంటిన తామా మహిళా సంబరాలు

సెప్టెంబర్ 16న అట్లాంటాలో తామా మహిళా సంబరాలు ఘనంగా జరిగాయి. అట్లాంటా తెలుగు సంఘం తామా ఆధ్వర్యంలో స్థానిక దేశాన పాఠశాలలో జరిగిన ఈ సంబరాలను కృష్ణన్ కంపెనీ, వెన్సాయి టెక్నాలజీస్ మరియు అల్లీడ్ ఇన్ఫర్మాటిక్స్ వారు సమర్పించగా ప్రముఖ యాంకర్ రాజేశ్వరి ఉదయగిరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

తామా సాంస్కృతిక కార్యదర్శి ప్రియ బలుసు స్వాగతోపన్యాసం చేయగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం మొదలైంది. ముందుగా స్థానిక గాయకురాలు శ్రీవల్లి శ్రీధర్ అమ్మ మీద పడిన పాట అందరిని ఆకట్టుకుంది. ఆటలలో భాగంగా నిర్వహించిన చిత్రం భళారే విచిత్రం, మెదడుకి మేత, డం శరాడ్స్, మరియు మినిట్ టు విన్ ఇట్ లాంటి ఇంటరాక్టివ్ గేమ్స్ లో మహిళలందరూ ఆసక్తిగా పాల్గొన్నారు. అలాగే హేమ శిల్ప ఉప్పల, సౌజన్య మధుసూదన్, హరిణి, రష్మీ కుకుడాల, అను రామిశెట్టి, ఉష్మ కాయం, మరియు కళ్యాణి మాడ్గుల ప్రదరిశించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.

తదనంతరం పిల్లల డాక్టర్ అనంద చుండూరి గారు ఇచ్చిన విలువైన సూచనలు సలహాలు మరియు గురువర్యులు లక్ష్మి అనుముకొండ పిల్లల విద్యకు సంబంధించి చేసిన ప్రసంగం అందరిని ఆలోచింపజేశాయి. మధ్యలో స్థానిక గాయకురాలు శ్రీవల్లి కొండూరు పాడిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. తర్వాత మనబడిలో స్వచ్ఛందంగా పిల్లలకు తెలుగు నేర్పుతున్న గురువులను, తామా నిర్వహిస్తున్న ఉచిత క్లినిక్ లో సేవలందిస్తున్న డాక్టర్లను మరియు స్పాన్సర్స్ ని వేదిక మీద ఘనంగా సత్కరించారు. అలాగే అంతకుముందు వారాంతం సెప్టెంబర్ 9న అట్లాంటా బాడ్మింటన్ క్లబ్ లో నిర్వహించిన బాడ్మింటన్, టెన్నికాయిట్, మ్యూజికల్ ఛైర్స్, తొక్కుడు బిళ్ళ, పదవిపంచి, అట్లాంటా నోట తెలుగు మాట, అట్లాంటాలో అన్నపూర్ణ, బెలూన్ డ్రాయింగ్ తదితర ఆటల పోటీల విజేతలకు కవిత నిమ్మగడ్డ మరియు షీలా లింగం గార్ల చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ బహుమతులు మరియు కరివేపాకు మొక్కలు ఇవ్వడం విశేషం. అట్లాంటాలోని ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఆభరణాలు మరియు వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

చివరిగా కనీవినీ ఎరుగని రీతిలో మహిళా సంబరాలను విజయవంతం చేసిన అట్లాంటా మహిళలకు, ఫోటో సేవలందించిన వాకిటి క్రియేషన్స్ కి, ఆడియో సేవలందించిన దేవానంద్ కొండూరు గారికి, వేదికను తక్కువ సమయంలో అత్యంత అందంగా అలంకరించిన శుభ్ ఈవెంట్స్ వల్లి మద్ది గారికి, రుచికరమైన భోజనాలను అందించిన స్వాగత్ ఇండియన్ రెస్టారెంట్ హవీలా గారికి, దేశాన పాఠశాల యాజమాన్యానికి, అలాగే ఈకార్యక్రమానికి సహకరించిన తామా కార్యవర్గ మరియు బోర్డు సభ్యులకు తామా సాంస్కృతిక కార్యదర్శి ప్రియ బలుసు కృతఘ్నతలు తెలియజేసారు. 300 మందికి పైగా పాల్గొన్న ఈకార్యక్రమాన్ని కర్త కర్మ క్రియ అన్నీ తామై పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించిన శిల్ప మద్దినేని, రమా పవార్, హరిప్రియ సర్వేపల్లి, శైలజ మీసాల మరియు ప్రియ బలుసు లను సభికులందరూ అభినందిస్తూ, మహిళల కోసం ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న అట్లాంటా తెలుగు సంఘం తామా ను కొనియాడారు.