నార్త్‌ కరోలినాలో ఘనంగా బతుకమ్మ, దసరా
MarinaSkies
Kizen

నార్త్‌ కరోలినాలో ఘనంగా బతుకమ్మ, దసరా

05-10-2017

నార్త్‌ కరోలినాలో ఘనంగా బతుకమ్మ, దసరా

తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్దమైన రెండు పండుగలు బతుకమ్మ, దసరా ఉత్సవాలను అమెరికాలోని నార్త్‌ కరోలినా రాజధాని చర్లొట్టేలో ప్రవాస తెలంగాణ వాసులు అంగరంగ వైభవంగా, అత్యంత ఘనంగా జరుపుకున్నారు. చార్లొట్టే తెలంగాణ అసోసియేషన్‌ (సిటిఎ) అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వేల మంది హాజరై ఆట పాటలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయకుడు గోరెటి వెంకన్న, గాయని ఆదర్శిని హాజరై ఉత్సవానికి మరింత వన్నెను చేకూర్చారు. సాంప్రదాయమైన చీరకట్టుతో మహిళలు పెద్ద ఎత్తున హాజరవడంతో అక్కడ సరికొత్త సాంస్కృతిక శోభ సంతరించుకుంది. రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో పెద్ద ఎత్తున ప్రజలు సభా వేదిక వద్దకు తరలి వచ్చారు. గౌరీపూజతో కార్యక్రమం ప్రారంభమైన ఉత్సవాలు సామూహిక, వ్యక్తిగతంగా ఆట, పాట, స్పర్థలతో పాటు నాట్యాలు, నృత్యాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. అత్యంత ఉల్లాసభరితంగా సాగింది.

ఈ సందర్భంగా బతుకమ్మ ప్రాధాన్యత, ప్రాశస్త్యాన్ని గోరేటి వెంకన్న అక్కడి వారికి సమగ్రంగా వివరించారు. అంతేకాకుండా బతుకమ్మ  ప్రాధాన్యతను తెలియజేసే పాటలు, తెలంగాణ విశిష్టతపై పాటలను పాడి ఆహుతులను అలరింపచేశారు. గాయని ఆదర్శిని కూడా బతుకమ్మ పాటలను పాడారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి సిటిఎ ఆధ్వర్యంలో బహుమతులను అందించారు.

ఈ కార్యక్రమంలో సిటిఎ అధ్యక్షులు శివరాం మాదాసు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి మర్పడగ, ప్రధాన కార్యదర్శి సంపత్‌ కసిరెడ్డి, మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ రెడ్డి బోధ, ఈవెంట్‌ కో ఆర్డినేటర్‌ మధుకర్‌ వెన్నపురెడ్డి, కల్చరల్‌ కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ సొమిశెట్టి తదితరులు పాల్గొన్నారు.