ఘనంగా ముగిసిన టాంటెక్స్ 122వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
MarinaSkies
Kizen

ఘనంగా ముగిసిన టాంటెక్స్ 122వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు

04-10-2017

ఘనంగా ముగిసిన టాంటెక్స్ 122వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు

కుదురుగా సాగిన ఎనుకుదురాట

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు శనివారం, సెప్టెంబరు16వ సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 122 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.

కార్యక్రమంలో ముందుగా చిరంజీవి శ్రియ సిద్ధార్థ ప్రార్థనా గీతం ఆలపించారు. ముఖ్య అతిథి అసమాన అవధాన సార్వభౌమ డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారితో పాటు సాహితీ బృందం జ్యోతి ప్రజ్వలనం చేసారు.

122వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన అసమాన అవధాన సార్వభౌమ డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు అచ్చ తెలుగు అష్టావధానం ఎనుకుదురాటని చేసి సాహితీ ప్రియులని మంత్రముగ్థులని చేసారు. అష్టావధానంలో డా. పుదూర్ జగదీశ్వరన్ సంధాతగా వ్యవహరించారు. శ్రీమతి బల్లూరి ఉమాదేవి నిషిధ్ధాక్షరి, డా.రామచంద్రారెడ్డి పురాణ పఠనం, శ్రీ వంశీ కృష్ణ దత్తపది, డా. జంధ్యాల జయకృష్ణ బాపూజి సమస్యా పూరణం, శ్రీ దొడ్ల రమణ వర్ణన, శ్రీ మద్దుకూరి చంద్రహాస్ అప్రస్తుత ప్రసంగం, చిరంజీవి కస్తూరి ప్రణవ్ చిత్రాక్షరి, చిరంజీవి శ్రియ సిద్ధార్థ ఆశువు బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీ రాయవరం విజయ భాస్కర్ గారు లేఖకుడిగా, శ్రీ బసాబత్తిన శ్రీనివాసులు ఉపలేఖకుడిగా వ్యవహరించారు.

అవధాని గారు శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారి నిషిద్ధాక్షరిలో చదువుల తల్లి శారదాంబ మీద కంద పద్యం చెప్పారు. డా.రామచంద్రారెడ్డిగారి పురాణ పఠనంలో అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర నుండి భారతీయ సత్ప్రవర్తన, పోతన గారి పద్యంలోని శబ్దాలంకార శోభ తెలిపారు. దత్తపదిలో శ్రీ వంశీ కృష్ణ గారిచ్చిన గుడి, బడి, మడి, తడి పదాలతో భారతదేశ విశిష్టత మీద ఒక పద్యం చెప్పారు. డా. జంధ్యాల జయకృష్ణ బాపూజి గారి సమస్యా పూరణంలో  "అత్తారమ్మని పిల్చె ఆలిని మగండు ఆ చిమ్మచీకట్లలో" సమస్యని రసవత్తరంగా పూరించారు.  శ్రీ దొడ్ల రమణ గారి వర్ణనలో ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుని వర్ణన ఆధారంగా ఉత్పలమాలలో ఈ లోకంలో ఉన్న విష్ణుచిత్తుని గురించి అద్బుతంగా వర్ణించారు. శ్రీ మద్దుకూరి చంద్రహాస్ గారు తమ అప్రస్తుత ప్రసంగంతో అందరికీ గిలిగింతలు పుట్టించారు. చిరంజీవి కస్తూరి ప్రణవ్ చిత్రాక్షరిలో 16 అక్షరాలతో తెలంగాణ ప్రభుత్వం తెలుగు తప్పనిసరి అన్న నిర్ణయంపై తేటగీతి తెలిపారు. చిరంజీవి శ్రియ సిద్ధార్థ ఆశువులో శ్రీరామాంజనేయ యుద్ధం నుంచి విశ్వామిత్రుని కోపంపై, బాహుబలి చిత్రంలో శివగామి బాహుబలిని చంపించడం తప్పాపై ఆశుపద్యం, Johny Johny Yes papa అచ్చ తెలుగులో చెప్పారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి,  కార్యవర్గ సభ్యులు  తదితరులు ముఖ్య అతిథి అసమాన అవధాన సార్వభౌమ డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారిని దుశ్శలువాతో సన్మానించి “అవధాన శిరోమణి” బిరుదుతో  సత్కరించారు

Click here for Event Gallery