పారిశ్రామికవేత్తల సదస్సుకు ఇవాంక ట్రంప్‌
MarinaSkies
Kizen

పారిశ్రామికవేత్తల సదస్సుకు ఇవాంక ట్రంప్‌

11-08-2017

పారిశ్రామికవేత్తల సదస్సుకు ఇవాంక ట్రంప్‌

భారత, అమెరికా దేశాల ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ శిఖరాగ్ర పారిశ్రామికవేత్తల సదస్సు  (గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌)- 2017కు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది. నవంబరు 28 నుంచి 30 వరకు జరిగే ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనయ ఇవాంకా ట్రంప్‌ కూడా పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని ప్రకటనపై కేసీఆర్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌లు ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సును పదేళ్లుగా వివిధ దేశాల్లో నిర్వహిస్తున్నారు. ఈసారి దీనిని భారత్‌లో జరపాలని నిర్వాహకులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను సూచించగా, వారు అంగీకరించారు. ఈ నిర్ణయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో తాజాగా వెల్లడించారు. రెండు దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే శిఖరాగ్ర సదస్సు భారత్‌కు గొప్ప అవకాశమని, ఈ వేదికపై ప్రపంచ పారిశ్రామికవేత్తలతో ఇక్కడి పారిశ్రామికవేత్తలు, అంకుర పరిశ్రమల వారు వేదికను పంచుకోవచ్చని అన్నారు. ఈ సదస్సులో పాల్గొనే అమెరికా బృందానికి ఇవాంకా ట్రంప్‌ నాయకత్వం వహిస్తారని ఆమె రాక ఆనందదాయకమని అన్నారు.