శ్వేతసౌధం ముందు ట్రంప్‌ ముఖాకృతితో కోడిబొమ్మ
APEDB

శ్వేతసౌధం ముందు ట్రంప్‌ ముఖాకృతితో కోడిబొమ్మ

11-08-2017

శ్వేతసౌధం ముందు ట్రంప్‌ ముఖాకృతితో కోడిబొమ్మ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరికి నిరసనగా ఆయన ముఖాకృతిని పోలిన, కోడి వలే రూపొందించిన 30 అడుగుల గాలిబొమ్మను శ్వేతసౌధం ముందు ప్రదర్శనగా ఉంచారు. శ్వేతసౌధానికి దక్షిణాన, వాషింగ్టన్‌ స్మారక కట్టడానికి సమీపాన గల పచ్చిక బయళ్లలో చికెన్‌ డాన్‌ పేరిట దీన్ని ఎగురవేశారు. ఈ నిరసన ప్రదర్శనకు జాతీయ ఉద్యానవన సేవలు, నిఘా విభాగం నుంచి ఆందోళనకారులు అనుమతి పొందారు. ఈ ప్రదర్శన జరిగిన సమయంలో ట్రంప్‌ శ్వేతసౌధంలో లేరు. న్యూజెర్సీలో గల బెడ్‌ మినిస్టర్‌లోని గోల్ఫ్‌ కోర్సులో గల నివాసంలో ఉన్నారు. డాక్యుమెంటరీల రూపకర్త, భారతీయ మూలాలున్న తరణ్‌సింగ్‌ బ్రార్‌ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. కొన్ని నెలలు ముందుగానే ఈ గాలిబొమ్మ తయారీకి అవసరమైన నిధుల సేకరణను ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టారు. ప్రస్తుతం ఈబేలో సుమారు రూ.96,000 ధరకు ఈ కోడిబొమ్మను అమ్ముతున్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుల వివరాలు వెల్లడించని ట్రంప్‌ ఓ పిరికిపంద అని, ఉత్తరకొరియాతో వ్యవహరించడంలో విఫలం చెందుతున్నారని, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అంటకాగుతున్నారని నిరసనకారులు ఆరోపించారు.