కప్పట్రాళ్ళలో 'తానా' స్త్రీశక్తి భవన్ ప్రారంభం...అలరించిన తానా సంక్రాంతి వేడుకలు

కప్పట్రాళ్ళలో 'తానా' స్త్రీశక్తి భవన్ ప్రారంభం...అలరించిన తానా సంక్రాంతి వేడుకలు

11-01-2019

కప్పట్రాళ్ళలో 'తానా' స్త్రీశక్తి భవన్ ప్రారంభం...అలరించిన తానా సంక్రాంతి వేడుకలు

(చెన్నూరి వెంకట సుబ్బారావు)

కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన స్త్రీ శక్తి భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన శనివారంనాడు ఘనంగా ప్రారంభించారు. టీజి వెంకటేష్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఐఎఎస్‌, ఆకె రవికృష్ణ, ఐపిఎస్‌ అధికారులతోపాటు తానా నాయకులు రవి పొట్లూరి నరేన్‌ కొడాలి, రాకేష్‌ బత్తినేని, ప్రసాద్‌ గారపాటి, ప్రకాశ్‌ బత్తినేని, లక్ష్మీదేవినేనితోపాటు ప్రముఖ గాయని సునీత, ఎన్‌ఆర్‌సి నాయుడు, ముప్పా రాజశేఖర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కృష్ణమూర్తి మాట్లాడుతూ, కప్పట్రాళ్ళ గ్రామ మహిళలు ఆర్థికంగా ఎదిగి దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరారు. కమ్యూనిటీ భవనాన్ని టీజి వెంకటేష్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఫ్యాక్షన్‌తో చితికిపోయిన మహిళలకోసం 60 లక్షలతో తానా స్త్రీ శక్తి భవననిర్మాణం

ఓవైపు ఐపీఎస్‌ అధికారి, మరోవైపు ఎన్నారై ప్రత్యేక శ్రద్ధతో ఫ్యాక్షన్‌ నిలయానికి చిరునామాగా ఉన్న కప్పట్రాళ్ళ గ్రామం నేడు అభివృద్ధికి చిరునామాగా మారింది. గతంలో కర్నూలు జిల్లా ఎస్‌పిగా పనిచేసిన ఆకె రవికృష్ణ 2014లో కప్పట్రాళ్ళను దత్తత తీసుకుని అభివృద్ధి గ్రామంగా మార్చారు. ఆయనకు కర్నూలు జిల్లాకు చెందిన ఎన్నారై, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కోశాధికారి రవిపొట్లూరి తోడయ్యారు. ఇద్దరూ కలిసి కప్పట్రాళ్ళ అభివృద్ధికి పాటుపడ్డారు. విద్యార్థుల చదువుకోసం స్కాలర్‌షిప్‌, వికలాంగులకు ట్రైసైకిళ్ళ పంపిణీ వంటి కార్యక్రమాలను చేపట్టారు. కమ్యూనిటీ సేవలో ఎప్పుడూ ముందుండే తానా కూడా గ్రామాభివృద్ధికి ముందుకు వచ్చింది. ఇక్కడి మహిళలు కోరినట్లుగానే దాదాపు 60లక్షల రూపాయలతో స్త్రీశక్తి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టి పూర్తి చేసింది. జనవరి 12వ తేదీన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి చేతులమీదుగా ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు.

ఫ్యాక్షన్‌ కష్టాల నుంచి...అభివృద్ధిలోకి

దేవరకొండ మండలంలో ఉన్న కప్పట్రాళ్ళ గ్రామ చరిత్రను పరిశీలిస్తే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఊరికి సంబంధించిన భూమిశిస్తు వసూళ్ళు, ఇతర ఆదాయ వసూళ్ళకోసం పాళెగాళ్ళు ఉండేవాళ్ళు. కొంతకాలం తరువాత ఈ పాలెగాళ్ళలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి దశాబ్దాలపాటు రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతీకారదాడులు జరుగుతుండేవి. ఫ్యాక్షన్‌కు పర్యాయపదంగా పేరు గాంచిన కప్పట్రాళ్ళ గ్రామంలో ఆధిపత్యపోరు వందల కుటుంబాలు చిన్నాభిన్నమైపోవడానికి కారణమైంది. 5వేలమంది జనాభాతో ఉన్న ఈ గ్రామంలో ఫ్యాక్షన్‌ తగాదాల వల్ల మగవాళ్ళు పారిపోవడమో, ప్రాణాలు కోల్పోవడమే జరిగింది. కొంతమంది జైలుకే పరిమితమైపోయారు. ఈ?నేపథ్యంలో అక్కడి మహిళలను, పిల్లలను ఆదుకునేందుకు ఆ జిల్లాకు ఎస్‌పిగా వచ్చిన ఆకె రవికృష్ణ ముందుకు వచ్చారు. గ్రామ కష్టాలను తెలుసుకుని అక్కడి మహిళలకు ఉపాధి లభించేలా చూడటంతోపాటు, విద్యార్థులు చదువుకునేలా  చూడటంతోపాటు, ఆ గ్రామానికి కావాల్సిన రహదారి సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు నడుంబిగించారు. ప్రభుత్వ సహకారం తీసుకుని రహదారులను నిర్మించారు. రెండు గదుల్లో ఉన్న పాఠశాలలో మరిన్ని గదులను నిర్మించి ఎంతోమందికి చదువులు చెప్పించేలా పాఠశాలను తీర్చిదిద్దారు. మహిళలకు స్వయంఉపాధికోసం కుటీరపరిశ్రమలశాఖ, ఎన్‌ఐఆర్‌డీతో గ్రామాన్ని అనుబంధంచేసి వారికి శిక్షణ ఇప్పించారు. సిమెంట్‌ ఫ్యాక్టరీల సాయంతో గ్రామంలో సిసిరోడ్లను వేయించారు. తాగునీటికి ఆర్‌వో ప్లాంట్లను ఏర్పాటు చేయించారు.

మరోవైపు రవి పొట్లూరి కూడా తన సొంత డబ్బులతో గ్రామాభివృద్ధికి కృషి చేశారు. పాఠశాలలో డిజిటల్‌ తరగతి గది ఏర్పాటుకోసం విరాళం ఇచ్చారు. దాంతోపాటు స్కూల్‌లో లైబ్రరీని 60 వేల రూపాయలతో ఏర్పాటు చేయించారు. క్రీడాసామాగ్రికోసం 30 వేల రూపాయలను, పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌లను ఉచితంగా అందజేయడంతోపాటు, ప్రతిఏటా స్కాలర్‌షిప్‌లను ఇస్తూ చదువులో వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం ఆయన దాదాపుగా లక్ష రూపాయలను ఖర్చు చేస్తున్నారు. గ్రామానికి చెందిన షాహిన్‌ పదవతరగతిలో మంచి ర్యాంక్‌ వచ్చినప్పటికీ ఉన్నత చదువులు చదవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో రవి పొట్లూరి ఆమె ఉన్నత చదువుకోసం 40వేల రూపాయలను ఖర్చు చేయడంతోపాటు ఆమెను కళాశాలలో చేర్పించారు.  ఎన్టీఆర్‌ బసవతారకం హాస్పిటల్‌ ద్వారా క్యాన్సర్‌ నిర్దారణశిబిరాన్ని కూడా రవి పొట్లూరి గ్రామంలో ఏర్పాటు చేయించారు. వికలాంగులకు ట్రైసైకిళ్లను కూడా పంపిణీ చేశారు. ఆకె రవికృష్ణ, మిత్రుడు ముప్పా రాజశేఖర్‌తో కలిసి గ్రామంలో అభివృద్ధికి రవి పొట్లూరి శ్రమిస్తున్నారు.

గ్రామాభివృద్ధికి ముందుకొచ్చిన తానా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాయకులు గ్రామాన్ని అభివృద్ధిపరిచేందుకు తమవంతుగా ముందుకు వచ్చారు. 2016లో తానా చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా గ్రామాన్ని రవి పొట్లూరి వినతిమేరకు తానా నాయకులు సందర్శించారు. జంపాల చౌదరి, సతీష్‌ వేమన, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటితోపాటు రవి పొట్లూరి, లావు అంజయ్య చౌదరి గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవిపొట్లూరి ఇచ్చిన విరాళంతో జయరామ్‌ కోమటి ఎపి జన్మభూమి కార్యక్రమంలో భాగంగా డిజిటల్‌ తరగతిగదిని ఏర్పాటు చేయించారు.  దీంతోపాటు  అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ అక్కడి మహిళలు తమకు ఆశ్రయం ఇచ్చేందుకు భవనాన్ని నిర్మించి ఇస్తే బావుంటుందని చెప్పడంతో తానా నాయకులు సరేనన్నారు. దాంతో తొలుత భవన నిర్మాణానికి 10 లక్షలు అవుతుందని అంచనావేశారు. దీంతో తానా తరపున భవన నిర్మాణంకోసం 6 లక్షలు ఇస్తామని ప్రకటించింది. రవి పొట్లూరి 4 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ఆకె రవికృష్ణ ఉచితంగా ఇచ్చారు. దీంతో తానా ఇక్కడ స్త్రీశక్తి భవనం పేరుతో నిర్మాణాన్ని ప్రారంభించింది. ముందు అనుకున్నట్లుగా 10 లక్షలు కాకుండా ఈ భవన నిర్మాణానికి 60లక్షల రూపాయలు వ్యయమైంది. దాంతో రవిపొట్లూరి, మిత్రుడు ముప్పా రాజశేఖర్‌  చెరో 10 లక్షల రూపాయలను ఇచ్చారు. కృష్ణపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ 5 లక్షల రూపాయలను, అమెరికాలో ఉన్న జగదీశ్‌ ప్రభల, ఉప్పుటూరి రామ్‌ చౌదరి, సతీష్‌ తుమ్మల తలా 1000 డాలర్లను విరాళంగా ఇచ్చారు.  తానా అధ్యక్షునిగా ఉన్న సతీష్‌ వేమన చైతన్యస్రవంతి కార్యక్రమంలో రైతుకోసం, ఇతర కార్యక్రమాలకోసం లక్షలాది రూపాయలను ఇచ్చినట్లుగానే ఈ భవన నిర్మాణానికి అవసరమైన వ్యయాన్ని కూడా  ఇస్తారని ఆశిస్తున్నారు.

ఈ భవనాన్ని తానా ఇండియా ఫౌండేషన్‌ పేరుతో రిజిష్టర్‌ చేస్తున్నారు. తానా ఎన్నో చోట్ల భవనాలను నిర్మించి ఇచ్చినప్పటికీ సొంతంగా తన పేరు మీద ఎక్కడా రిజిష్టర్‌ చేసుకోలేదు.  దీంతో ఈ స్త్రీశక్తి భవనమే తానా తొలి స్థిరాస్తిగా నిలిచిపోనున్నది. తానా ఈ భవన సంరక్షణకోసం వాచ్‌మెన్‌ను నియమిస్తోంది. ఈ భవన వ్యవహారాలకు సంబంధించిన  బాధ్యతను గ్రామంలోని స్వయం సహాయక గ్రూపులు చేపడుతున్నారు.

 Click here for Event Gallery