తండ్రికి తగ్గ తనయుడు బాలకృష్ణ - జయరామ్ కోమటి

తండ్రికి తగ్గ తనయుడు బాలకృష్ణ - జయరామ్ కోమటి

09-01-2019

తండ్రికి తగ్గ తనయుడు బాలకృష్ణ - జయరామ్ కోమటి

తెలుగు సినీరంగంలో మహోన్నతమైన నటునిగా, తెలుగు ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసి సగర్వంగా తలెత్తుకునేలా చేసిన నాయకునిగా నందమూరి తారక రామారావు నిలిచారని,  ఆయన జీవితం ఆధారంగా చిత్రాన్ని రూపొందించడమేకాకుండా ఆ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా బాలకృష్ణ నిరూపించారని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌కోమటి అన్నారు.

అమెరికాలోని పలు ప్రాంతాల్లో 'ఎన్టీఆర్‌-కథానాయకుడు' చిత్రాన్ని ఎన్నారైలు తిలకించారు.  బే ఏరియాలోని థియేటర్‌లో అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం, తెదేపా నేత మన్నవ సుబ్బారావు అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు.

అనంతరం కోమటి జయరామ్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను తిరుగులేని నటుడిగా నిరూపించిన చిత్రాలను ఈ సినిమాలో కళ్లకు కట్టారన్నారు. ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన కుమారుడు బాలకష్ణ నటించి తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారని కొనియాడారు. చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు క్రిష్‌కు అభినందనలు తెలిపారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన మహానటుడు ఎన్టీఆర్‌ అన్నారు. భావితరాలకు ఆయన ఆదర్శప్రాయుడని చెప్పారు. ఎన్టీఆర్‌ పాత్రలో బాలకష్ణ పరకాయ ప్రవేశం చేశారని కొనియాడారు. దర్శకుడు క్రిష్‌ కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో వెంకట్‌ కోగంటి, చందు మల్లెల, యశ్వంత్‌ కుదరవల్లి, రజనీకాంత్‌ కాకర్ల, గంగా కోమటి, శ్రీకాంత్‌ దొడ్డపనేని, హరి నల్లమల, బబ్బూరి సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.