న్యూజెర్సి సభ ఏర్పాట్లను జయరాం కోమటి తో సమీక్షించిన చంద్రబాబు

న్యూజెర్సి సభ ఏర్పాట్లను జయరాం కోమటి తో సమీక్షించిన చంద్రబాబు

05-09-2018

న్యూజెర్సి సభ ఏర్పాట్లను జయరాం కోమటి తో సమీక్షించిన చంద్రబాబు

తన అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సిలో తెలుగు దేశం పార్టీ అభిమానులు, ఇతరులతో జరగనున్న సమావేశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. 

ఈ రోజు అమెరికాలో ఎన్నారై టీడిపి ప్రముఖునిగా ఉన్న, ఉత్తర అమెరికా ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ని కలిసిన సందర్భంగా వివరంగా మాట్లాడారు. ఇది పార్టీ పరంగా జరిగే సభ అంటూ, ఈ సభ జయప్రదానికి తెలుగుదేశం పార్టీ మరియు ప్రభుత్వ అభిమానులు, చంద్రబాబు అభిమానులు, నందమూరి అభిమానులు అందరూ వచ్చి కృషి చేయాలని కోరారు. 

ఎన్నికలకు ముందు జరుగుతున్న సభ కాబట్టి ఈ సభ కోసం అందరూ ప్రత్యేకంగా కృషి చేయాలని కూడా ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం చేపడుతున్న పనులను, ప్రజలకోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ఎన్నారై తెలుగువారికోసం ప్రత్యేకంగా చేస్తున్న కార్యక్రమాలను కూడా అందరికీ తెలిసే విధంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. పోలవరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను, రాష్ట్రంలో ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనుల ప్రగతిని అందరికీ చూపాలని, అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల కోసం, నిధుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్మయుద్ధం గురించి అందరికీ చెప్పాలన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయం చేయడంలో చూపుతున్న నిర్లక్ష్యాన్ని కూడా ఎత్తి చూపాలన్నారు. అవినీతి పార్టీలను ప్రోత్సహిస్తున్న బిజెపి ఎత్తుగడలను అందరికీ తెలియజేయాలన్నారు. 

జయరాం కోమటి మాట్లాడుతూ, ఈ సభను విజయవంతం చేయడానికి తామంతా కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రారంభించారని తెలిపారు. అందరితోనూ కలిసి సమావేశానికి కావాల్సిన ఏర్పాట్లను చర్చించుకుని చేస్తామని కూడా ఆయన చెప్పారు. తెలుగు సంఘాల్లో ఉన్న పార్టీ అభిమానులను, ఎన్నారైలను ఇతర ప్రముఖులను కూడా ఈ సభకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.   కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ధర్మపోరాటాన్ని, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కూడా ఎన్నారైలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన మద్దతును ఈ సభ ద్వారా కూడగడుతామని కూడా జయరామ్‌ కోమటి చెప్పారు.