ఎపి జన్మభూమి సేవలపై కృష్ణా కలెక్టర్ హర్షం

ఎపి జన్మభూమి సేవలపై కృష్ణా కలెక్టర్ హర్షం

15-04-2018

ఎపి జన్మభూమి సేవలపై కృష్ణా కలెక్టర్ హర్షం

కృష్ణా జిల్లాలో ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల ఏర్పాటుపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రవాసాంధ్రులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 108 మంది ఎన్నారైల తో పాటు ఉత్తర అమెరికా లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జయరాం కోమటి కూడా కాలిఫోర్నియా నుండి పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 200 పాఠశాలలను పూర్తిగా డిజిటల్‌ పాఠశాలలుగా మారుస్తున్నట్లు తెలిపారు. ఏపీజన్మభూమి కార్యక్రమంలో భాగంగా ప్రవాసాంధ్రులు, వారి బంధువులు విరివిగా అందించిన విరాళాలు మరియు ప్రభుత్వ తోడ్పాటుతో దీన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ విషయం లో జిల్లా ఇప్పటికే ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. డిజిటల్‌ తరగతుల కార్యక్రమాలు విజయవంతం కావడానికి సహకరించిన జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి జయరామ్‌ కోమటి కూడా కతజ్ఞతలు తెలియజేశారు. ఇక ముందు ముందు జరగబోయే కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన వివరించి, తగు తోడ్పాటు అందించాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

ఇందుకు కలెక్టర్‌ కూడా ఒప్పుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా మరో 232 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటిల్‌ తరగతులు ఏర్పాటు చేయబోతున్నట్లు, అందుకు కావాల్సిన నిధులను సమకూరుస్తామని కలెక్టర్‌ తెలిపారు. జూన్‌ 12 న వీటి ప్రారంభోత్సవం ఒక వేడుక గా జరపాలని కలెక్టర్‌ సూచించారు. విరాళాలు అందజేసిన ప్రవాసాంధ్రులు మరియు వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరిస్తామని తెలిపారు.

జిల్లాలో చిన్న పిల్లల్లో పోషకాహార లోపం, గర్భిణీ స్త్రీలలో రక్త హీనత సున్నా స్థాయి కి తీసుకుని రావాలని మేము సైతం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు  కలెక్టర్‌ తెలిపారు. ఇందుకు సహకరించాలని ప్రవాసాంధ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రవాసాంధ్రులు ఒప్పుకున్నారు. జిల్లా అభివృద్ధి కి కలెక్టర్‌ చేస్తున్న కృషి పట్ల ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Click here for Photogallery