అమెరికా తెరపై సీనియర్ల క్రేజీ తగ్గినట్లే...

అమెరికా తెరపై సీనియర్ల క్రేజీ తగ్గినట్లే...

29-12-2017

అమెరికా తెరపై సీనియర్ల క్రేజీ తగ్గినట్లే...

టాలీవుడ్‌కు ఓవర్సీస్‌లో అతి పెద్ద మార్కెట్‌గా అమెరికా ఉంటోంది. అమెరికాలో వారం రోజులు ఆడితే చాలు మన సినిమా కష్టాలు తీరినట్టే అని అనుకునే నిర్మాతలు, బయ్యర్లు  చాలామందే ఉన్నారు. 2017 సంవత్సరంలో కూడా టాలీవుడ్‌ సినిమాలు అమెరికా మార్కెట్‌ను ఊపేశాయి. కాకపోతే బాహుబలి 2 తప్ప మిగతా చిత్రాలు ఏవీ రికార్డు కలెక్షన్లను క్రియేట్‌ చేయకపోయినా ఊపిరి పీల్చుకునేలా వసూళ్ళను రాబట్టింది. ఈ సంవత్సరం టాలీవుడ్‌ సీనియర్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ తమ చిత్రాలతో ఓవర్సీస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో అందరి సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి. చిరంజీవి ఖైదీ నెంబర్‌ 150 అంటూ ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేయగా.. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో బాలయ్య తెలుగు జాతి చరిత్రనే తన వందో సినిమాగా తీసుకొచ్చాడు. ఓం నమో వేంకటేశాయ, రాజుగారి గది-2తో నాగార్జున, 'గురు'తో వెంకటేష్‌ ఈ యేడాది అమెరికా అభిమానులను అలరించారు.

కాకపోతే ఈ సీనియర్ల సినిమాలకు ఎన్నారైలు చూపిన ఆదరణ ఎలా ఉందంటే హిట్‌ లేదు... ఫట్‌ కాదు అన్నట్లుగా ఉంది. సాధారణంగా ఎన్నారైలు విభిన్న, ప్రయోగాత్మక, ఫ్యామిలీ చిత్రాలను ఆదరిస్తుంటారు. హీరోలు చేస్తున్న ప్రయోగాలను బట్టే.. ఓవర్సీస్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉంటుంది. చాలా కాలం గ్యాప్‌ తీసుకుని 'ఖైదీ నెంబర్‌ 150' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవికి.. తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులతోపాటు ఎన్నారైలు కూడా ఫిదా అయ్యారు. అందుకే ఏకంగా 2.45 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లను ఆ సినిమాకు అందించారు. ఓవర్సీస్‌లో ఈ సినిమా టాప్‌-5వ స్థానంలో నిలిచింది. బాహుబలి మినహా.. మిగిలిన రికార్డులను తిరగరాస్తుందనుకున్న ఈ సినిమా.. ఓవర్సీస్‌లో బాహుబలి-2, బాహుబలి-1, శ్రీమంతుడు, అ..ఆ.. సినిమాల తర్వాతి స్థానంలో నిలిచింది.

మాస్‌ సినిమాలను తీస్తూ.. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను ఏర్పాటు చేసుకున్న బాలయ్యకు.. ఓవర్సీస్‌లో అంతగా మార్కెట్‌ లేదన్నది తెలిసిన విషయమే. కానీ తన వందో చిత్రంతో బాలయ్య ఓ అరుదైన రికార్డును క్రియేట్‌ చేశాడు. తెలుగు జాతి చరిత్రను తన వందో చిత్రంగా తీసుకురావడం.. విభిన్న చిత్రాలను తీసే క్రిష్‌ దానికి దర్శకత్వం వహించడంతో ఎన్నారై సినీ ప్రియులు 'గౌతమిపుత్ర శాతకర్ణిపై ఆసక్తికనపర్చారు. సినిమా కూడా ఊహించిన రేంజ్‌లో ఉండటంతో.. ఏకంగా 1.66 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లను కుమ్మరించారు. ఓవర్సీస్‌లో ఈ సినిమా టాప్‌-11వ స్థానంలో ఉంది. విక్టరీ వెంకటేష్‌కు ఇప్పటివరకు ఒక మిలియన్‌ డాలర్‌ మార్కును దాటిన సినిమాలు లేవు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఉన్నా.. అది మల్టీస్టారర్‌. ఈ యేడాది 'గురు' వంటి విభిన్న కథాంశంతో సినిమాను తీశాడు. అది తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే అది రీమేక్‌ కావడం, ఆ సినిమాను అంతకుముందే ఎన్నారైలు చూసేయడంతో.. ఓవర్సీస్‌ కలెక్షన్ల విషయంలో బెడిసికొట్టింది. ఈ సినిమా కూడా ఓవర్సీస్‌లో అనుకున్నంత లాభాలను తీసుకురాలేకపోయింది.

ఈ యేడాదిలో నాగ్‌ రెండు సినిమాలు చేశాడు. మొదటి అర్ధ సంవత్సరంలో ఓం నమో వేంకటేశాయ సినిమాతో ఫ్యాన్స్‌ను పలకరించాడు. కాకపోతే మెప్పించలేకపోయారు. ఆ తర్వాత రెండో అర్ధ సంవత్సరంలో రాజుగారి గది-2తో మాత్రం ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా హిట్‌ కొట్టింది.