అభిమానులతో మరోసారి రజనీ సమావేశం

అభిమానులతో మరోసారి రజనీ సమావేశం

23-12-2017

అభిమానులతో మరోసారి రజనీ సమావేశం

దక్షిణాది సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ మరోసారి తన అభిమానులను కలవబోతున్నారు. ఈ ఏడాదిలో ఆయన అభిమానులతో సమావేశం కావడం ఇది రెండోసారి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మే 15న అభిమానులతో సమావేశమైన రజనీకాంత్‌, వాళ్లతో అప్యాయంగా మాట్లాడారు. హితబోధలు చేశారు. జీవితంలో ఎలా ఉండాలో ఉండకూడదో సూచించారు. వ్యక్తిగతంగా ఛాయచిత్రాలు దిగారు. అభిమానులకు మరుపురాని సందర్భాలను మిగిల్చారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఊహాగానాల నేపథ్యంలో అభిమానులతో సమవేశం కావడం అప్పట్లో చర్చనీయం అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి రజనీ తన అభిమానులను కలవబోతున్నారు. చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో ఈ నెల 26 నుంచి 31 వరకు సూపర్‌స్టార్‌ తన అభిమానులతో సమావేశం కాబోతున్నారు. రోజుకు సుమారు వెయ్యి మంది అభిమానులతో మాట్లాడి, ఫొటోలు దిగనున్నారు. ఈ సమావేశం సజావుగా జరిగేందుకు హాజరయ్యే వారు అనుసరించాల్సిన నియమాలు అభిమాన సంఘం రూపొందించింది. మద్యం తాగొద్దని, రజనీని కలిసే సమయంలో ఆయన్ను కౌగిలించుకోవడం, పాదాభివందనాలు చేయవద్దని సూచించింది. గత సమావేశంలో దేవుడు కోరితే రాజకీయాల్లోకి వస్తానన్న రజనీ, ఈ సారి ఏ ప్రకటన చేస్తారో అనే ఆసక్తి కలుగుతోంది.