తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు

తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు

22-02-2018

తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు

తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు రానున్నది. ప్రఖ్యాత విప్రో సంస్థ తన ఉత్పత్తి యూనిట్‌ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నది. మూడురోజుల పాటు ఘనంగా జరిగిన వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ చివరి రోజున తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు చేసుకొన్నది. విప్రో సౌందర్య ఉత్పత్తుల తయారీ యూనిట్‌ ఏర్పాటు ఒప్పందంతోపాటు తైవాన్‌లోని తయువాన్‌ రాష్ట్రంతో సిస్టర్‌స్టేట్‌ ఒప్పందం కుదుర్చుకొన్నది. విప్రో సంస్థ ముఖ్య ప్రణాళికాధికారి (సీఎస్‌వో) రిషద్‌ ప్రేమ్‌జీతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము తెలంగాణలో ఒక తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు మంత్రికి రిషద్‌ ప్రేమ్‌జీ తెలిపారు. విప్రో వినియోగదారుల సంరక్షణ ఉత్పత్తుల విభాగం ఆధ్వర్యంలో సబ్బులు, ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని మహేశ్వరం మండలంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

ఇందుకోసం విప్రో సంస్థ దాదాపు రూ.220 కోట్లను పెట్టుబడి పెట్టనున్నది. 40 ఎకరాల్లో నిర్మించనున్న ఈ తయారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికీ, పరోక్షంగా 200 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటికే ఇతర విభాగాల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్రో సంస్థ నూతనంగా ఈ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకకంగా ధన్యవాదాలు తెలిపారు.