ఐటీలో పెరిగిన తెలంగాణ ప్రతిష్ట

ఐటీలో పెరిగిన తెలంగాణ ప్రతిష్ట

22-02-2018

ఐటీలో పెరిగిన తెలంగాణ ప్రతిష్ట

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌ నగరంలో జరిగిన వరల్డ్‌ ఐటి కాంగ్రెస్‌ 2018 సదస్సు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఖండాంతరాలకు తీసుకువెళ్ళింది. అంతర్జాతీయ ఐటీ విపణిలో మహానగరానికి ప్రత్యేక స్థానం దక్కింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రజారంజక పరిపాలన, లక్ష్యసాధనలో పురోగతి, భవిష్యత్తు వ్యూహాలను తెలుసుకోవడంలో విదేశీ ప్రతినిధులు ప్రత్యేక ఆసక్తి చూపారు. అలాగే ఈ ప్రతిష్టాత్మక సదస్సు ద్వారా రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు లభించనున్నాయి. కొత్తగా వచ్చే ఐటీ సంస్థల ద్వారా భవిష్యత్తులో లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడున్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలతో ఐటీ రంగంలో పెట్టుబడిదారులకు ఆసక్తి పెరిగింది. 35దేశాల నుంచి తరలి వచ్చిన ఐటీ సంస్థల అధిపతులు, నిపుణులు, ప్రతినిధులు తెలంగాణ ఐటీశాఖ మంత్రి చేసిన ప్రసంగాలకు ఫిదా అయ్యారు. వచ్చే నాలుగేళ్ళలో 15 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా శిక్షణ ఇచ్చేందుకు నాస్కామ్‌ కేంద్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ రంగంలో సుమారు లక్ష మందికి శిక్షణ ఇచ్చే లక్ష్యంతో హైదరాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కూడా కుదిరింది. దీంతో వచ్చే రెండేళ్ళలో విరివిగా పెట్టుబడులు వస్తాయని కేసీఆర్‌ సర్కారుకు భరోసా కుదిరింది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గడిచిన మూడున్నరేళ్ళలోనే ప్రభుత్వం ప్రకటించిన ఐటి పాలసీ, టి-హబ్‌తో రాష్ట్ర ప్రతిష్ట ఎంతో పెరిగింది. వేలకోట్ల రూపాయల పెట్టుబడులతో ఇక్కడ నెలకొల్పబడిన ఐటి కంపెనీల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు, అందుబాటులో ఉన్న మౌలిక సదు పాయాలు, మానవ వనరులు ఇవన్నీ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి.

ఫిబ్రవరి 19 నుంచి మూడు రోజులపాటు జరిగిన ఐటి కాంగ్రెస్‌లో 30 దేశాల నుంచి సుమారు 500 మంది వివిధ ఐటి కంపెనీల అధిపతులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 2,500 మంది ఐటిరంగ నిపుణులు పాల్గొన్నారు. కేంద్ర సాంకేతిక విజ్ఞానశాఖ, నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌), ప్రపంచ ఐటీ సర్వీసుల అలయెన్స్‌ (డబ్ల్యుఐటిఎఫ్‌)ల సంయుక్త భాగస్వామ్యంతో ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది.

మొదటిరోజు ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సదస్సును ప్రారంభించి  ప్రసంగించారు. డిజిటల్‌ ఇండియా లక్ష్యాలను నెరవేర్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం, బాధ్యతలను గుర్తుచేశారు. అదే సమయంలో ఐటి సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, తద్వారా టెక్నాలజీ అభివ ద్ధి, ఆ పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలకు చేరవేసే అంశాలపై ప్రధాని మార్గనిర్దేశం చేశారు. అనంతరం కేంద్ర ఐటిశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌, కేంద్ర ఐటిశాఖ కార్యదర్శి ఏపి సహాని, రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కేటీ రామారావు తదితరులు తమ ప్రసంగాలతో ఐటి ప్రపంచాన్ని ఆకట్టు కున్నారు. అత్యంత మేధో సంపత్తి కలిగిన ఐటిరంగ నిపుణులు తమ విధి నిర్వహణలో పని ఒత్తిడిని తట్టుకునే విధానంపై ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్‌ గంటపాటు ప్రసంగించి ఐటి దిగ్గజాలను ఆనందపరవశంలో ముంచెత్తారు.

2022 నాటికి దేశవ్యాప్తంగా అన్ని మారుమూల గ్రామా లకు సైతం సాంకేతిక పరిజ్ఞానం చేరవేయాలన్న లక్ష్యం తో కేంద్ర ప్రభుత్వం నాస్కామ్‌తో అవగాహన ఒప్పందం కుదు ర్చుకుంది.

రెండోరోజు ఐటి సదస్సులో ఐటి రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ళపై లోతైన చర్చ జరిగింది. నిపుణులు, ఐటి సంస్థల అధినేతలంతా తమ తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. సమస్యను అధిగమించి లక్ష్యాలను చేరుకునే క్రమంలో అవలంబించాల్సిన విధానాలపై సమాలోచనలు జరిపారు. రాష్ట్రంలో డాటాసైన్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఎక్సలెన్స్‌ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో నాస్కామ్‌ అంగీకారం తెలిపింది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఐటీ సదస్సులో రెండోరోజు రోబో సాఫియా ప్రసంగం, ఇంటర్వ్యూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన చౌమహాలా ప్యాలెస్‌లో ప్రతినిధులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ సంస్క తి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సంగీత విభావరి వారిని అలరించింది. ఆఖరు రోజున హెచ్‌ఐసీసీలో ప్రముఖ నటి దీపికా పదుకునే ప్రసంగం, కళాకారుల జానపద గేయాలు, ఆటలు, పాటలతో ఆనందోత్సాహాలతో సదస్సును ముగించారు.

Click here for Photogallery