ముద్దుకృష్ణమకు ప్రముఖుల నివాళులు

ముద్దుకృష్ణమకు ప్రముఖుల నివాళులు

07-02-2018

ముద్దుకృష్ణమకు ప్రముఖుల నివాళులు

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతి పట్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ భవన్‌లో గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఫొటోకు పూల మాలలు వేసి తెలుగుదేశం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌. దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. రెండు రాష్ట్రాలు గొప్ప మేధావిని కోల్పోయాయని అయన అన్నారు. మాకందరికీ ఆయన ఆదర్శమని అన్నారు. ఆయన లేకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కాశీనాథ్‌ చిలువేరు మాట్లాడుతూ గాలి ముద్దుకృష్ణమ నాయుడు పార్టీలో క్రమ శిక్షణతో పనిచేశారని అన్నారు.

కార్యకర్తలకు ఆయన జీవితం ఆదర్శమన్నారు. అనంతరం రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కొమ్మినేని సాయివికాస్‌ మాట్లాడుతూ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అకాల మరణం మమ్మల్నందరినీ దుఖ సాగరంలో ముంచిందన్నారు. పార్టీ పట్ల,  ప్రజలపట్ల ఆయన ఎనలేని అభిమానం చూపేవారన్నారు. సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పి. సాయిబాబా మాట్లాడుతూ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మొదట నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ నిజాలను నిర్భయంగా మాట్లాడేవారని అన్నారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని అన్నారు. మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు తాజుద్దీన్‌ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ఎన్‌టిఆర్‌ ఇచ్చిన నినాదాన్ని తు.చ. తప్పకుండా పాటించిన నాయకుడు ముద్దు కృష్ణమ అని అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్టేట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అజ్మీరా రాజునాయక్‌, రాష్ట్ర కార్యదర్శి కందిమల్ల రఘునాథరావు, బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పెద్దోజు రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.