ఈ నెల 14 నుంచి మైనింగ్ టుడే సదస్సు

ఈ నెల 14 నుంచి మైనింగ్ టుడే సదస్సు

06-02-2018

ఈ నెల 14 నుంచి మైనింగ్ టుడే సదస్సు

హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మైనింగ్‌ టుడే సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రారంభించాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు ఆహ్వానించారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో మైనింగ్‌ టుడే సదస్సు నిర్వహిస్తున్నారు. తెలగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఫిక్కీ సహకారం అందిస్తున్నాయి. మైనింగ్‌ రంగంలో పనిచేస్తున్న ఇంజినీర్లను, జియాలజిస్టులను, మినరల్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజిస్టులను, విద్యావేత్తలను, పారిశ్రామికవేత్తలను, ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజర్లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం.

ప్రపంచ మైనింగ్‌ రంగంలో దిగ్గజాలుగా పేరొందిన ఆస్ట్రేలియా, ఇటలీ, చైనా, కెనడా దక్షిణాఫ్రికా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఉక్కు, విద్యుత్‌, సిమెంట్‌, పెట్రోకెమికల్స్‌ వంటి వివిధ మైనింగ్‌ విభాగాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. పలు మైనింగ్‌ సంస్థల మధ్య వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించిన చర్చలు జరిపేందుకు ఈ సదస్సు వేదిక కానున్నది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వైభవాన్ని వివిధ దేశాల ప్రతినిధులకు చాటిచెప్పేందుకు ఈ వేదిక ఉపయోగపడనున్నది.