బేటీ పడావ్.. బేటీ బచావ్ - కెజి టు పిజి ఫ్రీ అంటే ఇదేనా?

బేటీ పడావ్.. బేటీ బచావ్ - కెజి టు పిజి ఫ్రీ అంటే ఇదేనా?

02-02-2018

బేటీ పడావ్.. బేటీ బచావ్ - కెజి టు పిజి ఫ్రీ అంటే ఇదేనా?

ఒక బంగారు తల్లి బలవంతంగా కన్ను మూసేసింది. చదువులతల్లి వొడిలో కేరింతలు కొడుతున్న ఈ పసిపిల్లను తోటి విద్యార్థుల ముందు హేళన చేసి.. అవమానించి.. ఫీజు కట్టలేదంటూ పరీక్ష రాయనీయకుండా చేసిన స్కూలు యాజమాన్యం ఇవ్వాళ తన నిర్లక్ష్యపు దాష్టీకానికి మొత్తం సమాజమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కల్పించింది. సాయి దీప్తి వయసు 14 ఏళ్ళు.. చదువుతోంది 9వ తరగతి. తన కన్నీటి వ్యధకు కారణమేంటో కూడా తెలియని వయస్సు ఆ అమ్మాయిది. రెండు మూడ్రోజుల్లో ఫీజు కట్టేస్తానంటూ బతిమలాడుకున్న తండ్రి విజ్ఞప్తుల్ని కూడా ఖాతరు చెయ్యని అమానుషత్వం యాజమాన్యానిది. ఏమైతేనేం.. ఇవ్వాళా చదువులతల్లి వెళ్లిపోయింది. ఒక స్కూలు.. ఇంకో ప్రభుత్వం.. చివరాఖరికి మొత్తం సమాజం ఈ హత్యకు బాధ్యత వహించాలి.

బేటీ పఢావ్ స్కీములొస్తాయి.. బడ్జెట్లొస్తాయి.. చదువు కోవాలనుకుంటున్న వాళ్లు చదువులు కొనుక్కోవడం మాత్రం మారలేదు. దీప్తి తండ్రి ఫీజెందుకు కట్టలేకపోయాడో ఇప్పటికిప్పుడు నా దగ్గర వివరాల్లేవు! జ్యోతి పేరుతో పుట్టుకొచ్చిన ఆ స్కూలుకు తెలంగాణా ప్రభుత్వం గుర్తింపు కూడా ఇచ్చింది. అక్కడ జరిగిపోయిన అమానుషం ఇవాళ్టి ప్రధాన దినపత్రికల్లో కనీసం చిన్న వార్త కూడా కాలేకపోయింది. జాతి మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యతలు తీసుకోవాల్సిన ప్రభుత్వాల్ని కనీసం వేలెత్తి చూపించే హక్కు కూడా లేదా? ‘సారీ మామ్’ అంటూ రెండే రెండు పదాలు రాసి బంగారంలాంటి బ్రతుకును ముగించేసుకున్న దీప్తి.. నువ్వు కాదమ్మా సారీ చెప్పాల్సింది. మేము.. మేమందరం.. వీ ఆర్ ఆల్ ఎషేమ్డ్!