దేశానికే తెలంగాణ ఆదర్శం : కేటీఆర్

దేశానికే తెలంగాణ ఆదర్శం : కేటీఆర్

23-01-2018

దేశానికే తెలంగాణ ఆదర్శం : కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పరిశమ్రల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణవాసులే తమకు ప్రగతి రాయబారులని అన్నారు. రాష్ట్రం సాధించిన అద్భుత అభివృద్ధిని దశదిశలా చాటాలని, బంగారు తెలంగాణ లక్ష్యాలు, స్వప్నాల సాధనకు కలిసి రావాలని కోరారు.  తెలంగాణ ఘనతను అన్ని దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పరిచయం చేయాలని, పారిశ్రామికవేత్తలతో అనుసంధానికి కృషి చేయాలని కోరారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌ నగరంలో తెలంగాణ ప్రవాసులతో జరిగిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం సమయంలోని అయోమయ పరిస్థితి నుంచి ప్రభుత్వం బయటపడి అచిర కాలంలోనే తనదైన ముద్ర చాటుకుంది. దశాబ్దంన్నర క్రితం ఏర్పాటైన రాష్ట్రాలు ఇంకా కుదురుకోలేదు. తెలంగాణ మాత్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కేసీఆర్‌ జనరంజక పాలనకు సర్వత్రా అభినందనలు వస్తున్నాయి.

తెలంగాణను వ్యతిరేకించిన వారంత ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రం విడిపోతే కరెంటు సమస్యలు వస్తాయని అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పవర్‌ పోయింది. తెలంగాణ ప్రజల కష్టాలు తొలగిపోయాయి. రాష్ట్రంలోనే కాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పవర్‌ పోతోంది. నిరంతర విద్యుత్‌ను చూసి తట్టుకోలేక  కాంగ్రెస్‌ దాన్ని రాజకీయం చేస్తోంది. రాష్ట్రం అంతటా తాగు, సాగునీటి కల్పనకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రజలకు  స్వచ్ఛమైన తాగునీటి సరఫరాతో పాటు రోడ్లు, మురుగునీటి పారుదల, పుట్‌పాత్‌లు ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాం అని అన్నారు.

Click here for Event Gallery