విజయవంతంగా ముగిసిన పతంగుల పండగ

విజయవంతంగా ముగిసిన పతంగుల పండగ

16-01-2018

విజయవంతంగా ముగిసిన పతంగుల పండగ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల ఉత్సవం విజయవంతంగా ముగిసింది. సంక్రాంతిని పురస్కరించుకుని మూడురోజులపాటు జరిగిన ఉత్సవాలు నగరవాసులను అలరించాయి. రకరకాల గాలిపటాలు, నోరూరించే మిఠాయిలు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ పతంగుల పండుగకు రాష్ట్రం ముచ్చటగా మూడోసారి ఆతిథ్యమిచ్చింది. ఈ నెల 13న మొదలైన సంబరాలు 15తో ముగిశాయి. సంక్రాంతి అంటే  ముందుగా గుర్తుకు వచ్చేది రివ్వున ఆశాకానికి ఎగిరే పతంగులే. అలాంటిది పరేడ్‌ మైదానంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ జరుగుతుండడంతో నగరవాసులు సికింద్రాబాద్‌ బాటపట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు రకరకాల పతంగులు గాలిలో ఎగురుతూ సందర్శకులను ఆకట్టుకున్నాయి. చీకటిలోనూ విద్యుత్‌ వెలుగుల్లో పతంగులు గాల్లో విహరించాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా గాలిపటాలను ఎగరవేస్తూ అందరూ ఆనందించారు.