ఫిబ్రవరి 19 నుంచి వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌

ఫిబ్రవరి 19 నుంచి వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌

02-01-2018

ఫిబ్రవరి 19 నుంచి వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌

అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు కేరాప్‌ అడ్రస్‌గా నిలుస్తున్న హైదరాబాద్‌ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్నది. వచ్చే నెల 19 నుంచి 21 వరకు మూడు రోజులపాటు వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (డబ్ల్యూసీఐటి) సదస్సును హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్నారు. యాంప్లిఫై డిజిటల్‌ -డిస్ట్ప్‌ దర కోర్‌ అనే థీమ్‌తో ఈ సదస్సు సాగనుంది. వరల్డ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ అలయెన్స్‌, భారతదేశానికి చెందిన ఐటీ, అనుబంధ సంస్థల వేదికైన నాస్కాం సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. ఈ సదస్సులో 80 ప్రధాన దేశాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులతో పాటు, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు.

భారత్‌లో ప్రథమం :

డబ్ల్యూసీఐటీ సదస్సును భారత్‌లో నిర్వహించటం ఇదే ప్రథమం. వరల్డ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ అలయెన్స్‌ ఆధ్వర్యంలో 1978లో తొలిసారిగా డబ్ల్యూసీఐటీ సదస్సు జరిగింది. 2016లో బ్రెజిల్‌లో, 2017లో తైవాన్‌ లో నిర్వహించారు. ఈ ఏడాది హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తున్నది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌ విభాగంలో ప్రాధాన్యం గల వేదికగా డబ్ల్యూసీఐటీ నిలుస్తున్నది. దాదాపుగా 80 ప్రధాన దేశాలకు చెందిన 2,500 మందికి పైగా ప్రముఖులు, దిగ్గజసంస్థల ప్రతినిధులు, విద్యాసంస్థల ప్రతినిధులను ఒకే వేదికపై తీసుకొస్తున్నది. భారతదేశంలో నిర్వహిస్తున్న అత్యున్నత లీడర్‌షిప్‌ ప్రోగ్రాం అనే గుర్తింపును నాస్కాం పొందింది. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు, వ్యూహాలు, వ్యాపార ప్రణాళికలు, భవిష్యత్‌ సవాళ్ల్లు-ఎదుర్కోవాల్సిన విధానాలు వంటివి ఈ వేదికగా చర్చిస్తారు. మూడు రోజుల ఈ సదస్సులో వివరణాత్మకమైన ప్రసంగాలు, బృంద చర్చలు, నెట్‌ వర్కింగ్‌ వంటివి ప్రధానంగా ఉంటాయి.

డిజిటల్‌ భవిష్యత్‌ను సాకారం చేసేందుకు ఈ వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సులో ప్రసంగించనున్నవారిలో మౌనిర్‌జాక్‌ (అమెరికా ఒలింపిక్‌ కమిటీ), మైకెల్‌గోరిజ్‌ (స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌), ఎడ్‌మాన్సర్‌ (ఎమర్సన్‌ ఎలక్ట్రికల్‌), ఆండ్య్రూహార్టన్‌ (బ్రిటిష్‌కౌన్సిల్‌), స్కాట్‌ సాండ్‌శ్కాపర్‌ (నోవార్టీస్‌), శ్రీనివాసన్‌ ఏటీ ( ఖతార్‌ ఎయిర్‌వేస్‌), జగ్గీ వాసుదేవ్‌ (ఇషా ఫౌండేషన్‌), పుల్లెల గోపిచంద్‌ (బ్యాడ్మింటన్‌ కోచ్‌) తదితరులు ఉన్నారు.