మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం

మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం

28-12-2017

మంత్రి  కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం

తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావుకు మరో అరుదైన గౌరవం లభించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 23 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సుకు హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందించింది. ప్రతి సంవత్సరం నిర్వహించే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో వ్యాపార, ఆర్థికవేత్తలు, రాజకీయప్రతినిధులు సుమారు 2,500 మంది పాల్గొంటారు. సాధారణంగా ఈ సదస్సుకు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులను మాత్రమే ఆహ్వానిస్తారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం తొలిసారిగా ఒక రాష్ట్రానికి మంత్రి అయిన కేటీర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపింది.

తెలంగాణ రాష్ట్రం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలువడంపై అభినందనలు తెలిపిన ఫోరం, దీనిని సాధించడంలో కీలకంగా పనిచేసిన మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపుతున్నట్టు తెలిపింది. ఢిల్లీలో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనడం, హైదరాబాద్‌లో ప్రపంచ  పారిశ్రామికవేత్తల సదస్సును నిర్వహించిన తీరు, అందులో మంత్రి భాగస్వామ్యాన్ని ప్రత్యేకంగా పరిగణించింది. దీంతో పాటు మూడేండ్లుగా తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ముఖచిత్రంగా ఉంటున్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కేటీఆర్‌ వివిధ దేశాల నుంచి హజరుకానున్న పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో సమావేశమవుతారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి ఆహ్వానం అందడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.