హైదరాబాద్‌కు మరో ఐకాన్‌ టవర్‌

హైదరాబాద్‌కు మరో ఐకాన్‌ టవర్‌

06-11-2017

హైదరాబాద్‌కు మరో ఐకాన్‌ టవర్‌

మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా 435 సంవత్సరాల కిందట హైదరాబాద్‌కు శంకుస్థాపన చేశారు. చార్మినార్‌ను నిర్మించారు. దేశ విదేశాలకు చెందిన అనేక మందిని నగరం ఆకర్షిస్తుందని ఆయన భావించినట్టే, నేడు నగరం విశ్వనగరంగా మారింది. అప్పట్లో కులీ కుతబ్‌ షా చేసిన అలాంటి మరో ప్రయత్నమే ఇమేజ్‌ టవర్‌. టి ఆకారంలో నిర్మించనున్న భవనం తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతిని తెస్తుంది. టెక్నాలజీని కేంద్ర బిందువుగా నిలుస్తుంది. వివిధ రాష్ట్రాలు, దేశాల మల్టీమీడియా రంగాల వారిని మరో చార్మినార్‌లా ఆకర్షిస్తుంది. నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా నిలుస్తుంది అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

రంగారెడ్డి జిల్లా శేర్‌లింగంపల్లి మండలం రాయదుర్గంలోని హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీ వద్ద నిర్మించనున్న ఇమేజ్‌ (ఇన్నోవేషన్‌ ఇన్‌ మల్టీమీడియా, యానిమేషన్‌, గేమింగ్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) టవర్‌ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఐటీ, ఐటీ సంబంధిత రంగాల్లో తెలంగాణ ఇప్పటికే అగ్రగామిగా ఉంది. ఇమేజ్‌ టవర్‌ నిర్మాణం పూర్తయితే మల్టీమీడియా, యానిమేషన్‌, గేమింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లోనూ అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తుంది. నగరంలో ఇప్పటికే వందకుపైగా కంపెనీలున్నాయి. 30 వేల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఘన విజయాలు సాధించిన చిత్రాలు బహుబలి, ఈగ, అరుంధతి, లైప్‌ ఆఫ్‌ పై తదితర చిత్రాలకు గ్రాఫిక్స్‌ ఇక్కడే సమకూర్చారు. నగరంలో ఈ రంగంలో అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి.  పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ స్థాయి పరిజ్ఞానాన్ని అందించాలన్న లక్ష్యంతో ఇమేజ్‌ టవర్‌ నిర్మాణానికి నాంది పలికాం అని కేటీఆర్‌ వివరించారు. రూ.946 కోట్లతో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో దీనిని నిర్మిస్తున్నారు. రాబోయే మూడేళ్ల (2020) లో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.


Click here for PhotoGallery