అన్ని పదవులకు రేవంత్ రెడ్డి రాజీనామా

అన్ని పదవులకు రేవంత్ రెడ్డి రాజీనామా

28-10-2017

అన్ని పదవులకు రేవంత్ రెడ్డి రాజీనామా

ఇరకాటంలో చంద్రబాబు..!

తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి.. ఆ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సైకిల్‌ గుర్తుపై గెలుపొందిన రేవంత్‌రెడ్డి.. పార్టీని వీడిన వెనువెంటనే ఎమ్మెల్యే పదవిని సైతం త్యజించారు. పార్టీ ఫిరాయింపులు, నాయకుల అనైతిక బరితెగింపులు ఇరు తెలుగు రాష్ట్రాలనూ కుదిపేస్తున్న నేపథ్యంలో రేవంత్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రేవంత్‌ రాజీనామా.. అన్ని రకాలుగానూ చంద్రబాబును ఇరకాటంలో నెట్టేసింది.  

రేవంత్‌రెడ్డి రాజీనామాతో టీడీపీ తెలంగాణలో మూతపడే స్థితికి చేరుకుంది. దీనికితోడు ఆంధ్రపదేశ్‌లో చంద్రబాబు ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 21మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. పార్టీ మారినా.. దర్జాగా అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నా.. ఏ ఒక్కరితోనూ రాజీనామా చేయించని చరిత్ర చంద్రబాబుది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ పంచన చేరడమే కాకుండా.. ఏకంగా మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు. ఇలా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం.. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. తాజాగా ఇదే అంశంపై అసెంబ్లీ సమావేశాలను సైతం బహిష్కరించిన సంగతి తెలిసిందే.

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంతగా డిమాండ్‌ చేస్తున్నా.. చంద్రబాబు చెవికెక్కించుకోని సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా చంద్రబాబు రెండేళ్లుగా అనైతిక రాజకీయాలు నెరుపుతున్నారు. దీనిపై రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా.. చంద్రబాబు, అధికార టీడీపీ మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రేవంత్‌ రాజీనామా నేపథ్యంలో ఫిరాయింపుల విషయంలో చంద్రబాబు అనైతిక రాజకీయం మరోసారి చర్చనీయాంశమైందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో సైతం అంతర్గతంగా ఇదే చర్చ కొనసాగుతోంది. పార్టీకి, పదవులకు రేవంత్‌ రాజీనామా నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామా అంశం ప్రముఖంగా తెరపైకి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.