రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్
Sailaja Reddy Alluddu

రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్

28-10-2017

రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్

అమరావతి:టీటీపీలో జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని సీఎం చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన లేఖలో వివరించారు. టీడీపీ అన్నా చంద్రబాబు అన్నా తనకు ఎంతో గౌరవమని రేవంత్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు న్యాయకత్వంలో చేసిన పోరాటాలు తనకు గొప్ప అనుభావాన్ని ఇచ్చాయని రేవంత్ లేఖలో పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుతో రాజకీయ ప్రయాణం మరిచిపోలేనిదన్నారు. ‘‘మీతో నా ప్రయాణం మరిచిపోలేనిది. మీ నాయకత్వంలో చేసిన పోరాటాలు గొప్ప అనుభవాన్నిచ్చాయి. మీ అనుచరుడిగా, టీడీపీ నేతగా గుర్తింపు పొందడం గర్వకారణం. తక్కువ సమయంలో పార్టీలో మంచి గుర్తింపు ఇచ్చారు. సీనియర్లు ఉన్నా నాకు కీలక అవకాశాలిచ్చారు. నా శక్తిమేరకు సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించా. కార్యకర్తలతో నా అనుబంధం విడదీయరానిది. టీడీపీతో బంధం తెంచుకోవడం నాకు గుండె కోతతో సమానం’’ అని రేవంత్‌ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్రోత్సాహం, కార్యకర్తలించిన ధైర్యంతో 40 నెలలుగా కేసీఆర్ అరాచకాల పై పోరాడానని రేవంత్ గర్వంగా చెప్పుకున్నారు. కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాబిన్నమయ్యాయని, గిరిజన రైతులకు బేడీలు వేసి ఆత్మగౌరవం దెబ్బతీశారని ఆరోపించారు. మల్లన్న సాగర్ ను రావణకాష్టంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నేరేళ్లలో దళిత, బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, భూపాలపల్లిలో గుత్తికోయల ఆడబిడ్డలను బట్టలూడదీసి చెట్లకు కట్టేసి కొట్టారని పేర్కొన్నారు. ఇలాంటి హృదయ విదారక సందర్భాలు ప్రతిపక్షాల ఉనికిని కేసీఆర్ సహించలేకపోతున్నారని రేవంత్‌రెడ్డి లేఖలో వివరించారు.