చలో అసెంబ్లీపై సీఎం కేసీఆర్ అసహనం: రైతులంటే అంత అలుసా..!!ఎక్కడికక్కడ అరెస్టులతో ఉక్కుపాదం..!!!

చలో అసెంబ్లీపై సీఎం కేసీఆర్ అసహనం: రైతులంటే అంత అలుసా..!!ఎక్కడికక్కడ అరెస్టులతో ఉక్కుపాదం..!!!

27-10-2017

చలో అసెంబ్లీపై సీఎం కేసీఆర్ అసహనం: రైతులంటే అంత అలుసా..!!ఎక్కడికక్కడ అరెస్టులతో ఉక్కుపాదం..!!!

సమస్యలన్నీ పరిష్కరిస్తామని, రైతులకు అండగా ఉంటామని పదేపదే చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నదా? అన్న సందేహాలు కనిపిస్తున్నాయి. అన్నదాత సంక్షేమానికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సీజన్‌కు ఎకరాకు రూ.4000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఘనంగా ప్రకటించిన తెలంగాణ సర్కార్.. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లలో పత్తి రైతుకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించడంలో విఫలమవుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పత్తి తేమగా ఉన్నదని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు కొనేందుకు నిరాకరించడంతో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.1000 చొప్పున కొనేందుకు తెగబడ్డారు.దీనికి నిరసనగా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లోని వ్యవసాయ మార్కెట్లలో రైతులు ఆందోళనకు దిగారు.

ఇతర ప్రాంతాల్లోనూ రైతులు నిరసన తెలుపుతున్నారు. పత్తికి మద్దతు ధర ఇవ్వాలని, రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. ఇందుకోసం శాంతిభద్రతల పరిరక్షణ పేరిట పోలీసు శాఖను ఉపయోగించుకుని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరు కాకుండా గురువారం నుంచి ముందస్తు అరెస్టులు చేసేందుకు వెనుకాడటం లేదు.అన్నిజిల్లాల్లోనూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే అన్ని ప్రధాన రహదారులపైనా చెక్‌పోస్టులు పెట్టి ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు. చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి ఎవరైనా వాహనాల్ని అద్దెకిస్తే సీజ్‌ చేస్తామని పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ నియంత్రుత్వ విధానం తీరు స్పష్టంగా బయటపడుతోంది.

అసెంబ్లీ సమావేశాల సన్నాహకంగా తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో తొలిరోజే 'చలో అసెంబ్లీ' పేరిట నిరసన తెలపడం ఏమిటని సాక్షాత్ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసహనం వ్యక్తం చేశారు. సమస్యలపై 50 రోజుల పాటు చర్చిస్తుండగా, ఆందోళనలు చేయడమేమిటని ఎదురుదాడికి దిగుతున్నారు.

ఇక చలో అసెంబ్లీకి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఘాటుగానే ప్రభుత్వానికి సమాధానమిచ్చారు. పోలీసులతో ఆందోళనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. చలో అసెంబ్లీలో ఏం జరిగినా సర్కార్‌దే బాధ్యత అని హెచ్చరించారు. తెలంగాణ కోసం సాగరహారం నిర్వహించిన తరహాలోనే రైతులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలి వస్తారని సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా గాంధీభవన్‌ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించి తీరుతామన్నారు. రౌడీలను పంపి అల్లర్లు చేయించాలని టీఆర్‌ఎస్‌ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించి రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మరోవైపు పోలీసులు అన్ని బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లలోనూ తనిఖీ చేస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 2500 మంది కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో జెడ్పీటీసీలు శంకర్‌నాయక్‌, కర్నాటిలింగారెడ్డిలతో పాటు 60 మంది నాయకుల్ని అరెస్టు చేశారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎల్పీనేత జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి అనుచరులపై నిఘా పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా నాయకులు గౌతమిశెట్టి వెంకటేశ్వర్లును, చౌటుప్పల్‌లో పది మందిని అరెస్టు చేశారు. బీబీనగర్‌లో నాయకులను గృహనిర్బంధం చేశారు. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. నల్గొండ, సాగర్‌, దేవరకొండ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎలాంటి ఆందోళనలు చేయకుండా పోలీసులు ముందస్తుగా సిద్ధం అయ్యారు. గూడూరు టోల్‌ప్లాజా వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ముఖ్యనాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వారిని అరెస్టు చేశారు. కొత్తగూడెంలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గురువారం రాత్రి ఇళ్లలోకి వెళ్లి ముఖ్య నాయకులను ఠాణాలకు తరలించారు. కొత్తగూడెంలోని ఒకటో పట్టణ, మూడో పట్టణ పోలీసు స్టేషన్ల పరిధిలోని ముఖ్య నాయకులు ఎంఏ రజాక్‌, కరాటే రామస్వామి, కాసుల వెంకట్‌, బొందుగుల శ్రీధర్‌, జక్కం సీతయ్యలను అరెస్టు చేశారు.