ఘనంగా ‘అలయ్- బలయ్’
MarinaSkies
Kizen

ఘనంగా ‘అలయ్- బలయ్’

01-10-2017

ఘనంగా ‘అలయ్- బలయ్’

విజయ దశమి సందర్భంగా బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం నిర్వహించిన ‘అలయ్- బలయ్’ ఘనంగా జరిగింది. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే వివిధ వేషాధారులైన కళాకారుల నృత్యాలు చూపరులను ఆకర్షించాయి, డప్పువాయిద్యాలు హోరెత్తాయి. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ముఖ్య నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. నేతలు తమ ప్రసంగాల్లో దత్తాత్రేయ పార్టీలకు అతీతంగా గత 13 ఏళ్ళుగా ప్రతి ఏడాది దసరా పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సందేశాలు పంపించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ హయర్ ప్రసంగిస్తూ విజయ దశమి విశిష్టత గురించి చెప్పారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి సంతోష్ కుమార్ గైక్వార్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అభిలాషించారు. బిజెపి జాతీయ సంఘటన్ ప్రధాన కార్యదర్శి రాంలాల్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు మరింత కష్టపడాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ ప్రసంగిస్తూ ప్రతి ఏడాది కుల, మతాలకు అతీతంగా అలయ్-బలయ్ నిర్వహిస్తున్న దత్తాత్రేయను అభినందించారు. రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రసంగిస్తూ టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన ఈ మూడేళ్ళలో తెలంగాణ కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. టిఆర్‌ఎస్ ఎంపి కె. కేశవరావు ప్రసంగిస్తూ అలయ్-బలయ్ అంటేనే దత్తన్న కార్యక్రమంగా పేరెన్నికగన్నదని అన్నారు. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ప్రసంగిస్తూ పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి దత్తాత్రేయ తీసుకుని వస్తున్నారని తెలిపారు.

దత్తాత్రేయ ప్రసంగిస్తూ అవినీతి క్యాన్సర్ వంటిదని, అవినీతిపై యుద్ధ్భేరి మోగించాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలని, అన్ని రంగాల్లోనూ దేశంలో ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.