టీఆర్‌ఎస్‌ పార్టీ పగ్గాలు కేటీఆర్‌కేనా?

టీఆర్‌ఎస్‌ పార్టీ పగ్గాలు కేటీఆర్‌కేనా?

27-03-2017

టీఆర్‌ఎస్‌ పార్టీ పగ్గాలు కేటీఆర్‌కేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గంలో భారీ మార్పులు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆలోచిస్తున్నట్లు వార్త. పార్టీపై పెత్తనాన్ని వదులుకోరాదన్న రీతిలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేదా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని తన కుమారుడు రాష్ట్ర మంత్రి కే. తారకరామారావుకు అప్పగించాలని అనుకుంటున్నారు.  రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు తన వారసుడిగా కుమారుడిని నిలబెట్టే చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ 2004లో అధికారంలోకి వచ్చాక జరిగిన కరీంనగర్‌ ఉప ఎన్నికల సమయంలో కేటీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనంతరం ఉద్యమంలోను, టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అఖండ మెజారిటీ వచ్చిందంటే అందుకు కేటీఆర్‌ వ్యూహ చతురతే కారణం.   

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అప్పట్లో మాజీ ఎంపీ నరేంద్ర తన పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసిన సందర్భంగా తొలి సారాగా ఆయనకు పార్టీలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని అప్పగించారు. ఇప్పుడు పార్టీకి  అధ్యక్షుడే తప్ప వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లేరు. కాంగ్రెస్‌, టిడిపిలకు అధ్యక్షులతో పాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు.