ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్తు

ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్తు

26-03-2017

ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్తు

తెలంగాణ రాష్ట్రంలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కేటాగిరిలోని కాంపోజిట్‌ పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్‌ ఉందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్‌ బి బాలమల్లు తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందేలా తెలంగాణ ప్రభుత్వం టిఎస్‌ ఐఐసి తరపున పారిశ్రామికవేత్తలను అన్ని విధాల సహకారం అందిస్తామని అన్నారు. ఒక హోటలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్రాల కాంపోజిట్‌ మాన్యుఫాక్చరర్ల (టాక్యా) సమావేశాన్ని ప్రభుత్వ పరిశ్రమల సలహా దారు పాపారావుతో కలిసి బాలమల్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలమల్లు మాట్లాడుతూ ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ రంగంలో హైదరాబాద్‌కు మొదటి నుంచి ప్రముఖ స్థానం ఉందని చెప్పారు. ఈ క్రమంలో కాంపోజిట్‌ పరిశ్రమల క్లస్టర్‌ ఏర్పాటు టిఎస్‌ఐఐసి నుంచి 123 ఏకరాలను 70 సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కేటాయించామని వివరించారు. ఈ అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని బాలమల్లు పిలుపునిచ్చారు.  సిఎం కేసీఆర్‌ అమల్లోకి తెచ్చిన టిఎస్‌ ఐపాస్‌ దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక పాలసీగా ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందుతోందని వెల్లడించారు.

ప్రభుత్వ సలహాదారు బివి పాపారావు మాట్లాడుతూ ప్రపంచీకరణ ప్రభావంతో డొమెస్టిక్‌, మిలిటరీ అవసరాల కోసం రాబోయే రోజుల్లో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగంలో లక్షల కోట్ల రూపాయల వ్యయం చేసే పరిస్థితులు వచ్చాయని అన్నారు. ఈ సమావేశంలో టాక్మా చైర్మన్‌ సాంబిరెడ్డి, అధ్యక్షుడు కె నారాయణరెడ్డి, కెనెకో కంపెనీ ప్రతినిధి శేఖర్‌ సర్ధేశాయ్‌, టిఐ ఎఫ్‌ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.