ఐటీ రంగంలో 25వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

ఐటీ రంగంలో 25వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

26-03-2017

ఐటీ రంగంలో 25వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది ఐటి రంగంలో కొత్తగా 25వేల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోవాలనుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఐటి రంగంపై విడుదల చేసిన పద్దులో ప్రకటించింది. ఈ ఏడాది ఇంతవరకు 15 వేల ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించగా, 65వేల కోట్లకుగాను ఫిబ్రవరి నాటికి 62 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఐటీ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని,  ఏ సమయంలోనైనా ట్రాకింగ్‌ చేయడంతోపాటు ప్రభుత్వ సేవలకు సంబంధించి పౌరుల సమస్యలను డిజిటల్‌ రూపంలో స్వీకరించేందుకు 15 రకాల టూల్స్‌తో కాల్స్‌ను, పర్యవేక్షించేందుకు ఎలక్ట్రానిక్‌ సర్వీసు డెలివరీ (ఇఎస్‌డి) డిజిటల్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళకను రూపొందించినట్లు తెలిపింది.

రాష్ట్రమంతా 4జి సేవలను సమకూర్చడం, ప్రధాన నగరాలు,  పట్టణాల్లో వైఫై సదుపాయం కల్పించడం, ఆరవ తరగతి నుండి ప్రతి విద్యార్థికి కంప్యూటర్‌ బేసిక్స్‌ను బోధించడం చేశామని చెప్పింది. కాగా, డిజిటల్‌ తెలంగాణకు బడ్జెట్‌లో కోటి రూపాయలను కేటాయించగా, తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌కు 5 కోట్ల రూపాయలను కేటాయించారు.