కొండగట్టులో ఘోర ప్రమాదం

కొండగట్టులో ఘోర ప్రమాదం

11-09-2018

కొండగట్టులో ఘోర ప్రమాదం

జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కొండగట్టు మీద నుంచి కిందకు వస్తున్న సయమంలో ప్రమాదమైన మూల మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు.ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు లోయలో పడటంతో ఊపిరాడక అధిక సంఖ్యలో మృతి చెందారు. మరో నిమిషంలో ప్రధాన రహదారిపైకి చేరుకునే సమయంలో ప్రమాదం జరిగింది. స్పీడ్‌ బ్రేకర్‌ దగ్గర అదుపు తప్పగా, ప్రయాణికులంతా డ్రైవర్‌ వైపు ఒరగడంతో బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది.  ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్సీ సింధూ శర్మ, కలెక్టర్‌ శరత్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. మృతుల్లో 25 మంది మహిళలే ఉన్నారు. మృతిచెందిన వారిలో ఇప్పటివరకు 35 మందిని అధికారులు గుర్తించారు. వారిలో 30 మంది శనివారంపేట, హిమ్మత్‌రావుపేటకు చెందినవారని నిర్థారించారు.