ఎపిలో ఆధ్యాత్మిక పర్యాటకం

ఎపిలో ఆధ్యాత్మిక పర్యాటకం

13-03-2017

ఎపిలో ఆధ్యాత్మిక పర్యాటకం

ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగా టెంపుల్‌ టూరిజంకు ప్రాముఖ్యతను ఇస్తూ కార్యాచరణను చేపట్టింది. రాష్ట్ర  ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ఈ రంగంలో ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు సంకల్పించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఒక్కో రంగంలో ప్రసిద్ధి చెందాయి. నవ్యాంధ్రను టూరిజమ్‌ హబ్‌గా మార్చి ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సహజంగా ఏపీలో తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, మంత్రాలయం, అహోబిలం తదితర ప్రసిద్ధి గాంచిన ఆలయాలు ఉంటాయనేది జగమెరిగిన సత్యం.

తమిళనాడు తరువాత అత్యధికంగా 24 వేల దేవాలయాలు నవ్యాంధ్రలో ఉన్నాయనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీనిపై దృష్టిని కేంద్రీకరించిన  రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు, కేరళ,  మహారాష్ట్ర తరహాలో టెంపుల్‌ టూరిజంకు శ్రీకారం చుట్టింది. దేవాదాయ శాఖలో ఉప శాఖగా రిలీజియన్‌ టూరిజమ్‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని  ప్రముఖ ఆధ్యాత్మిక నగరాలు, దేవాలయాలను సందర్శించేలా టూర్‌ కారిడార్‌లను రూపొందించారు. సీఎం చంద్రబాబు ఆకాంక్ష  మేరకు దేవాదాయ శాఖ మంత్రి మాణికార్యలరావు రిలీజియస్‌, స్పిరిచ్యువల్‌ టూర్‌ కారిడార్‌ల రూపకల్పనకు అధిక ప్రాధ్యాన్యత ఇస్తున్నారు. దేశ, విదేశాల నుంచి టూరిస్ట్‌లను ఆకర్షించే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రైల్వే, ఆర్‌టీసీ, ఏపీ టూరిజం, యాత్రా బస్‌, ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్‌లు ప్రత్యేకంగా రూపొందించిన ఆధ్యాత్మిక టూర్‌ సర్య్యూట్‌లలో యాత్రలకు రూపకల్పన చేశారు. ఈ ఆధ్మాత్మిక  టూర్‌లో పర్యాటకులకు టారిఫ్‌ను టూర్‌ ఆపరేటర్లు రూపొందిస్తారు. అలాగే దేవాదాయ, ధర్మాదాయ శాఖ కూడా ఆధ్మాత్మిక ఆలయాల్లో టూరిస్ట్‌లకు అవసరమైన మౌలిక సదుపాయాలతోపాటు వివిధ రకాల పూజా సేవలను అందిస్తుంది.