విశాఖకు తరలివస్తున్న పర్యాటకులు

విశాఖకు తరలివస్తున్న పర్యాటకులు

29-12-2017

విశాఖకు తరలివస్తున్న పర్యాటకులు

విశాఖకు పర్యాటకుల సంఖ్య ఈ సంవత్సరం గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోల్చి చూస్తే, ఈ ఏడాది పర్యాటకుల తాకిడి 40 శాతం వరకూ పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా విశాఖలో ప్రతి ఏడాది సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ పర్యాటకులు వస్తుంటారు. సెప్టెంబర్ నుంచి బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గడ్ ప్రాంతాల నుంచి పర్యాకులు అంతంతమాత్రంగానే విశాఖకు వచ్చారు. గడచిన వారం రోజుల్లో పర్యాటకుల తాడికి విపరీతంగా పెరిగిపోయింది. ఈనెల 31వ తేదీ వరకూ అరకు, విశాఖల్లో హోటళ్ల గదులన్నీ ఫుల్ అయిపోయాయి. చాలా మంది బెంగాలీలు ముందు విశాఖకు వచ్చి, ఇక్కడి నుంచి అరకు, అనంతగిరి తదితర ప్రదేశాలకు వెళుతున్నారు. దీంతో పర్యాటక శాఖ అదనంగా బస్సులు నడపాల్సి వస్తోంది.

అరకు అద్దాల ట్రైన్‌లో అయితే, కనీసం నిలబడడగానికి కూడా చోటు లేని పరిస్థితి ఉంది. అరకు ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు భారీగా పెరిగిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ఒడిశా, ఛత్తీస్‌గడ్, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. బొర్రా గుహలను సందర్శించేందుకు వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దీంతో కేవ్స్ బయట వందల సంఖ్యలో జనం బారులు తీరి నిలబడవలసి వస్తోంది. విశాఖ బీచ్ రోడ్డు పర్యాటకులతో నిండిపోయింది. ఇక్కడి కురుసుర మ్యూజియం తిలకించేందుకు వందల సం ఖ్యలో జనం క్యూ కట్టిన పరిస్థితి ఉంది. టియు- 142 విమాన మ్యూజియం కూడా గురువారం నుంచి అం దుబాటులోకి రాబోతోంది. కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, విమాన మ్యూజియం ఒకేసారి చూడాలనుకునే వారికి టిక్కెట్ ధరలో రాయితీ ఇస్తున్నట్టు వుడా వైస్ చైర్మన్ బసంత్ చెప్పారు. అలాగే, గురువా రం నుంచి మూడు రోజులపాటు ఆర్‌కే బీచ్‌లో విశాఖ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నారు. హెలీ టూరిజంను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.