అమరావతిలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌

అమరావతిలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌

27-12-2017

అమరావతిలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు గ్రామానికి నైరుతి వైపున స్టేట్‌ లెవల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీ ఏర్పాటు కానుంది. ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ల్యాబ్‌కు మూడు ఎకరాలను సీఆర్‌డీఏ కేటాయించింది. జిల్లాకు ఒకి చొప్పున రీజనల్‌ సైన్స్‌ ల్యాబరేటరీలుంటాయి. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి స్టేట్‌ లెవల్‌ లాబ్‌రేటరి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంది. రాజధాని అమరావతిలో స్టేట్‌ లెవల్‌ ల్యాబ్‌ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించటంతో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. నేరపరిశోధనలో ఈ సైన్స్‌ ల్యాబరేటరీ నివేదికలే కీలకం. వాటి ఆధారంగానే పోలీసులు నిందితులను గుర్తించి నేర నిర్థారణ చేస్తారు.

డీఎన్‌ఏ పరీక్షలు కూడా ఈ ల్యాబ్‌లో జరుగుతాయి. రాజధానిలో అంతటి ప్రతిష్ఠాత్మకమైన ల్యాబ్‌ ఏర్పాటు కాబోతుండటం సంతోషంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. తుళ్లూరు పరిసరాలలో ఏదో ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రికి రైతులు విన్నవించారు. రైతుల వినతిని పరగణలోకి తీసుకుని ప్రభుత్వం ల్యాబ్‌ ఏర్పాటు చేయటానికి నిర్ణయించినట్టు సమాచారం. సీఐడీ పోలీస్‌ అధికారులు, సీఆర్‌డీఏ అధికారులు శంకుస్థాపన చేయబోయే  ప్రదేశాన్ని సందర్శించారు. ముఖమంత్రి రావటానికి హెలీప్యాడ్‌ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.