ఎపి మంత్రివర్గంలో సంతోషానికి ఓ శాఖ !?

ఎపి మంత్రివర్గంలో సంతోషానికి ఓ శాఖ !?

11-04-2017

ఎపి మంత్రివర్గంలో సంతోషానికి ఓ శాఖ !?

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో కొత్తగా ఓ శాఖను ప్రవేశపెడుతున్నారు. ఈ శాఖ పేరు హ్యాపినెస్‌ ఇండెక్స్‌ అంట. ఈ శాఖ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రూపకల్పన జరుగుతోంది. ఇటీవల జరిగిన  మంత్రివర్గ విస్తరణ సందర్భంగా హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించనున్నారు. దేశంలో హ్యాపీనెస్‌ ఇండెక్స్‌కు సంబంధించిన ఓ విభాగాన్ని తొలిసారిగా మధప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ రకాల ప్రశ్నలకు ముద్రించి, వాటికి వచ్చే సమాధానాల   ఆధారంగా హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ కు మదింపు చేస్తున్నారు. ఆ రాష్ట్రానికి సంబంధించి తొలిసారిగా హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ను వచ్చే ఏడాది ప్రకటించేందుకు అక్కడి ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహాన్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓ అంతర్జాతీయ సంస్థ గత నెలలో ప్రకటించిన వివరాల ప్రకారం హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో భారత్‌ 122వ స్థానంలో ఉంది. నార్వే మొదటి స్థానానిన కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సంతోష సూచికను మెరుగుపరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భూటాన్‌ నేషనల్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ స్ఫూర్తిగా  2029 విజన్‌ డాక్యుమెంట్‌లో హ్యాపీనెస్‌  ఇండెక్స్‌ను ప్రభుత్వం చేర్చింది. భూటాన్‌లో 9 అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని అక్కడి ప్రజల హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ను మదింపు చేస్తున్నారు. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కాలాన్ని ఉపయోగించుకునే తీరు, విద్య, సుపరిపాలన, గ్రామాల్లో సామాజిక అభివృద్ధి, సాంస్కృతిక వైవిధ్యం సమస్యల నుంచి త్వరగా బయటపడగలగడం, పర్యావరణం జీవనప్రమాణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ను లెక్కిస్తారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ గురించి తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు. ఈ సారి ఏకంగా ఒక విభాగానే ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల ఆదాయాన్ని పెంచడం ద్వారా కూడా జీవితాల్లో  సంతోష  స్థాయి పెరుగుతుందని సిఎం అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి నెలవారీ కనీస ఆదాయం 10వేల రూపాయలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల జరిగిన ప్యూచర్‌ డీకోడెడ్‌ సదస్సులో కూడా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు. నిర్ణిత కాలానికి వివరాల సేకరణ ద్వారా ఇండెక్స్‌ను మదింపు చేసే యోచన ఉంది. ఈ శాఖకు సంబంధించినే ఇంకా విధివిధానాలపై సృష్టత రానప్పటికీ, త్వరలో నిర్ణయం వెలువడవచ్చని భావిస్తున్నారు.