అసెంబ్లీ సీట్లు పెంచండి!

అసెంబ్లీ సీట్లు పెంచండి!

04-11-2017

అసెంబ్లీ సీట్లు పెంచండి!

విభజన చట్టంలో పేర్కొన్న హామీలను త్వరగా నెరవేర్చాలని కేంద్రాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా కేంద్రమంత్రులతో చంద్రబాబు వరుసగా సమావేశమయ్యారు. ముఖ్యంగా విభజన చట్టంలోని హామీలు, అసెంబ్లీ సీట్లపెంపు, పోలవరంకు రావాల్సి నిధులపై కేంద్రమంత్రుల భేటీలో చర్చించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించామని తెలిపారు.

విభజన చట్టంలోని హామీలను ఎంతవరకు నెరవేర్చారో సమీక్ష చేయాలని కోరామని, అసెంబ్లీ సీట్ల పెంపుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. సీట్ల పెంపుపై కసరత్తు చేస్తున్నామని చెప్పారని, త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానుందని అమిత్‌షా బదులిచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పోలవరానికి నిధులు మంజూరు విషయంలో ఇబ్బంది లేకుండా చూడాలని అడిగామని తెలిపారు. ఈఏపీ సహా నిధుల పరంగా రాష్ట్రానికి ప్రాధాన్యతా ఇవ్వాలని, రెవెన్యూ లోటు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. మొత్తానికి ఈ సీట్ల పెంపుపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని అన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ పనులు జరగకపోతే పోలవరం ఎప్పటికీ పూర్తి కాదని కేంద్రమంత్రితో చెప్పినట్లు వివరించారు. కేంద్ర మంత్రులతో సమావేశంలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్‌ పలువురు ఎంపీలు పాల్గొన్నారు.