కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌

కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌

01-11-2017

కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌

కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ నిర్మాణాన్ని చేపట్టేందుకు బహుళజాతి సంస్థ అయిన ఆస్ట్రేలియాకు చెందిన ఉడ్‌సైడ్‌ ఎనర్జీ లిమిటెడ్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థకు చెందిన ప్రతినిధులు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రారంభించనున్న కార్యకలాపాలపై సంస్థ ప్రతినిధులు చర్చించారు. కాగా ఉడ్‌సైడ్‌ సంస్థ ఇప్పటికే రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఫలితంగా ప్రత్యక్షంగా 1200 మందికి, పరోక్షంగా మరో రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కాకినాడలో ఎల్‌ఎన్‌జి టెర్మినల్‌ అభివృద్ధితో పాటు రీగ్యాసిఫికేషన్‌ ఏర్పాటులోనూ ఉడ్‌సైడ్‌ ఎనర్జీ లిమిటెడ్‌ సంస్థ భాగస్వాములు కానుంది. టెర్మినల్‌ నిర్మాణం పూర్తయిన పక్షంలో రాష్ట్రంలోని వ్యవసాయాధారిత పరిశ్రమలకు అవసరమైన కోల్డ్‌ ఎనర్జీని సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని అంచనా.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఆస్ట్రేలియన్‌ బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని దేశాల నుంచి కూడా పెట్టుబడులకు సంబంధించి పలువురు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని చెప్పారు. వారిని అన్ని విధాలా ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పక్షంలో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని, అన్ని రకాల వసతులు, సబ్సిడీలు, వెసులుబాటు కూడా ఉంటాయని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉడ్‌సైడ్‌ ఎనర్జీ లిమిటెడ్‌ రాకతో పారిశ్రామిక రంగానికి ఊపుఖాయమని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.