'కార్పొరేట్' ఒత్తిడికి స్వస్తి..

'కార్పొరేట్' ఒత్తిడికి స్వస్తి..

29-10-2017

'కార్పొరేట్' ఒత్తిడికి స్వస్తి..

ఇకపై ఆందోళన లేని చదువులు..సాయంత్రం 6 వరకే తరగతులు..ఆదివారం పూర్తిగా ఆటవిడుపే.. ఫిర్యాదుల కోసం 18002749868..ప్రతిభ ఆధారిత తరగతుల గ్రేడింగ్‌కు స్వస్తి..చదువు.. చదువు అంటూ చంపుతున్న కార్పొరేట్‌ కాలేజీలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

 అమ్మానాన్నల ఆశలను తీర్చలేక.. ‘కార్పొరేట్‌’ ఒత్తిడిని తట్టుకోలేక.. ‘పోటీ’ పరుగులో అలసిసొలసి చివరకు బలవన్మరణాలకూ తెగిస్తున్న విద్యార్థులకు సాంత్వన కలిగించాలన్న లక్ష్యంతో మేము చేసిన అక్షర యజ్ఞంపై సర్కారు స్పందించింది.

 విద్యార్థులకు ఒత్తిడి లేని చదువులు అందించాలంటూ కార్పొరేట్‌ కాలేజీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

నో గెస్ట్‌.. నో రెస్ట్‌.. నో పీస్‌.. ఇదీ తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్‌ కాలేజీల్లోని విద్యార్థుల పరిస్థితి.కార్పొరేట్‌ బందీఖానాల్లోని విద్యార్థుల దినచర్య తెల్లవారు జామున 5 గంటలకు ప్రారంభమవుతుంది. క్షణం తీరిక లేకుండా రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. 

ఈ 18 గంటల్లో 16 గంటలు పుస్తకానికే విద్యార్థులు పరిమితం. మిగిలిన రెండు గంటల సమయంలోనే కాలకృత్యాలు.. అల్పాహారం.. భోజనం అన్నీ అయిపోవాలి. ఆరు గంటల అరకొర నిద్ర తర్వాత మళ్లీ షరా మామూలే. 

ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. నాణేనికి మరోవైపు పరిస్థితి ఇంకా దయనీయం. చదువులో వెనకబడ్డారంటూ తరగతుల గ్రేడింగ్‌ పేరుతో అవమానం.. విద్యార్థులందరి ముందూ తిట్లూ.. తన్నులు.వెరసి విద్యార్థి మానసిక వికాసానికి తోడ్పడాల్సిన చదువు అతన్ని తీవ్ర నిరాశనిస్పృహలోకి నెట్టేసి బలవన్మరణానికి పాల్పడే విధంగా ప్రోత్సహిస్తోంది.

ఫలితంగా ఏడాది వ్యవధిలో తెలుగు రాష్ర్టాల్లో పదుల సంఖ్యలో కార్పొరేట్‌ కాలేజీల విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఒక్క ఏపీలోనే 10నెలల్లో 10మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

తల్లి తండ్రుల ఆరాటం.. కాలేజీల వ్యాపారం.. విద్యార్థులకు ప్రాణసంకటంగా మారిన వైనంపై ఈ నెల 17 నుంచి వరుస కథనాలను ప్రచురించింది. ఈ కథనాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించింది.

 సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. విద్యార్థులకు ఒత్తిడి లేని చదువు అందించాలని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఇంటర్‌ బోర్డును ఆదేశించారు. స్పందించిన ఇంటర్‌ బోర్డు ఆగమేఘాలపై ఉత్తర్వులు (ఆర్‌సీ నంబరు స్పెషల్‌- 12-ఈ3-2017) జారీ చేసింది. ఇష్టారాజ్యంగా తరగతుల నిర్వహణకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఈ ఉత్తర్వుల్లో హెచ్చరించింది. ఈ నెల 20న జారీ అయిన ఈ ఉత్తర్వులతో కార్పొరేట్‌ కాలేజీల ధోరణిలో కాస్త మార్పు కనిపిస్తోంది.

కార్పొరేట్‌ తీరు మారుతోంది

జ్వరం వచ్చినా... ‘కాలేజీకి పంపండి.. మా దగ్గర మందు బిళ్లలున్నాయి’ అంటూ గతంలో ఒత్తిడి చేసే యాజమాన్యంలో మార్పు వచ్చిందని, జ్వరం తగ్గాకే పంపండని నేడు మా అబ్బాయి విషయంలో చెప్పడమే ఇందుకు నిదర్శమని విజయవాడకు చెందిన ఓ విద్యార్థి తండ్రి వెంకటేశ్‌ అన్నారు.

 చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులదీ ఇదే అభిప్రాయం..! గతంలో ఆదివారం సెలవు ఇవ్వని కాలేజీలు ఇప్పుడు సెలవు ఇస్తున్నాయి.పిల్లల్ని చూడాలని తల్లిదండ్రులు కాలేజీకి వెళితే, అక్కడి సిబ్బంది పరుష పదజాలంతో మాట్లాడేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వారు చెబుతున్నారు.

ఒత్తిడి లేని చదువు అందించేందుకుగాను ప్రభుత్వం తీసుకున్న చొరవ పట్ల విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటర్‌ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల సారాంశం

రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే తరగతులు, స్టడీ అవర్‌లు పెట్టుకోవాలి.ఏ కళాశాల కూడా నిర్దేశిత సమయానికి ముందు కానీ.. తర్వాత కానీ క్లాసులు పెట్టడం, స్టడీ అవర్లు నిర్వహించడం చేయకూడదు.

సెలవు దినాలు, ఆదివారాల్లో విద్యార్థులకు పరీక్షలు పెట్టడం, తరగతులు నిర్వహించడం చేయకూడదు.హాస్టల్‌ విద్యార్థులకు సైతం ఉదయం 8 గంటలకు ముందు కానీ సాయంత్రం 6 గంటల తర్వాత కానీ ప్రత్యేక తరగతులు పెట్టుకూడదు.

ప్రతి కళాశాలలో విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఫిజికల్‌ డైరెక్టర్‌ ద్వారా వ్యాయామ తరగతులు నిర్వహించాలి. ఆటలు ఆడించాలి.

విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి అందుకు తగిన విధంగా వారిని గ్రూపులు చేసి చదివించడం, తరగతులు నిర్వహించడం చేయకూడదు.అన్ని కళాశాలల్లో తప్పనిసరిగా విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఫిర్యాదు సెల్‌ ఏర్పాటు చేయాలి. 

అలాగే కౌన్సెలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసి చదువులో ఒత్తిడికి గురయ్యే వారికి ఉత్సాహం కలిగించే విధంగా వారిలో మానసిక పరివర్తనకు కృషి చేయాలి. కళాశాలల్లో తప్పనిసరిగా సైకియాట్రిస్టును నియమించుకోవాలి.

ఎవరైనా విద్యార్థులను చదువుకోవాలంటూ ఒత్తిడి చేసినా, అదనపు తరగతులు నిర్వహించి వేధించినా వెంటనే టోల్‌ ఫ్రీ నెంబరు 1800 2749868కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.