విజయవాడ కేంద్రంగా ఇండిగో విమాన సర్వీసులు
Telangana Tourism
Vasavi Group

విజయవాడ కేంద్రంగా ఇండిగో విమాన సర్వీసులు

06-10-2017

విజయవాడ కేంద్రంగా ఇండిగో విమాన సర్వీసులు

విజయవాడ కేంద్రంగా విమాన సర్వీసులను నడపాలని ఇండిగో నిర్ణయించింది. ఇందుకు భారీ ఆపరేషన్స్‌ను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. దేశంలోని ప్రధాన నగరాలకు విజయవాడ నుండి సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా 50 ఏటీఆర్‌ విమానా కొనుగోలుకు ఇప్పటికే ఇండిగో ఆడర్‌ ఇచ్చినట్లు సమాచారం. ఎక్కువ విమానాలను విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా నడపాలని భావిస్తోంది. తొలి దశలో విజయవాడ నుంచి హైదరాబాద్‌, బెంగుళురు, చెన్నై నగరాలకు 2018 జనవరి నెల నుండి విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్స్‌ టైమింగ్‌ను ఇండిగో ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఎయిర్‌ఇండియా, స్పైస్‌జెట్‌ సంస్థలు విమాన సర్వీసులను నడుపుతున్నాయి. విమాన సంస్థల మధ్య పెద్దగా పోటీ ఏదీ లేకపోవడంతో భారీగా చార్జీలను ఆయా సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండిగో విజయవాడ నుండి పెద్ద ఎత్తున విమాన సర్వీసునలు ప్రారంభిస్తే వీటి మధ్య పోటీ నెలకొని చార్జీలు తగ్గే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.