కేంద్ర కేబినెట్‌లోకి కంభంపాటి?

కేంద్ర కేబినెట్‌లోకి కంభంపాటి?

25-07-2017

కేంద్ర కేబినెట్‌లోకి కంభంపాటి?

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు డాక్టర్‌ కంభంపాటి హరిబాబును కేంద్రమంత్రి పదవి వరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు వర్గానికి చెందిన కంభంపాటి హరిబాబుకు, త్వరలో జరగనున్న కేంద్ర క్యాబినెట్‌ విస్తరణలో కేంద్ర సహాయమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, వెంకయ్య దన్నుతో నాయకత్వం ఆయననే కొనసాగిస్తూ వస్తోంది. ఒక దశలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, లేదా కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పార్టీ వర్గాలు అందిస్తారన్న ప్రచారం జోరుగా జరిగిన విషయం తెలిసిందే. అయితే వారిని అడ్డుకునేందుకు ఓ వర్గం వ్యూహాత్మకంగా, రాయలసీమ నేతలను తెరపైకి తీసుకు రావడంంతో ఎటూ నిర్ణయం తీసుకోలేక హరిబాబునే కొనసాగించారు. త్వరలో జరగనున్న కేంద్ర క్యాబినెట్‌ విస్తరణలో హరిబాబుకు అవకాశం ఇస్తారని, ఆ తర్వాతనే రాష్ట్ర పార్టీ విస్తరణపై జాతీయ నాయకత్వం సీరియస్‌గా దృష్టి సారిస్తుందని ఓ సీనియర్‌ నేత వెల్లడించారు.