చంద్రబాబుకు అతిపెద్ద చొక్కా బహూకరణ

చంద్రబాబుకు అతిపెద్ద చొక్కా బహూకరణ

18-03-2017

చంద్రబాబుకు అతిపెద్ద చొక్కా బహూకరణ

ఉద్యోగాల కోసం ప్రయత్నించటం కాదు. అలా ప్రయత్నించేవారికి ఉద్యోగావకాశం కల్పించారు. ఇంటిపట్టున ఉండే వస్తూత్పత్తితో ఆదాయం సంపాదించే వనరును సృష్టించారు. వేలాదిమందికి ఉపాధి చూపారు. రాష్ట్రంలో అంకుర సంస్థల విధానానికి శ్రీకారం చుట్టి తమకు ఎంతో మేలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.శుక్రవారం తనను సందర్శకుల్లా వచ్చి కలసిన యువకులను ముఖ్యమంత్రి అభినందించారు. ఒక వినూత్న ఆలోచనను ఆచరణలో పెడితే అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారని, ప్రపంచంలో మారుతున్న విధానాలకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చెప్పారు. 

గతంలో ఐటీ విప్లవం ఉంటే, ఇప్పుడు ఐటిప్లస్ ఐఓటీతో నాలుగొ పారిశ్రామిక విప్లవం నడుస్తోందని వివరించారు. అంకుర సంస్థలు (స్టార్టప్‌లు) ప్రారంభించేవారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వారికి తెలిపారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రానున్న కాలంలో అంకుర కంపెనీలే యువత భవితకు మార్గం వేస్తాయని అన్నారు. తాము తీసుకొచ్చిన నైపుణ్య శిక్షణ విధానం వివిధ వృత్తులు చేపట్టిన యువతకు, కార్మికుల ఉపాధిని మెరుగుపరుస్తుందన్నారు.

స్టార్టప్‌ల విజయాలు వివరించేందుకు సీఎంను కలసిన ఆ యువకులు స్పందిస్తూ ‘మీరే మా స్ఫూర్తిదాత. రానున్న కాలంలో కానున్న పారిశ్రామికవేత్తల కోసం మీరు తీసుకొచ్చిన అంకుర సంస్థల విధానం (స్టార్టప్స్ పాలసీ) మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ‘మేం బతకటమే కాదు. వేలాదిమందికి జీవనోపాధికి బాటవేస్తున్నాం. ఇదంతా మీ వల్లనే. మీకు ఎంతో రుణపడి ఉంటాం’ అని ముఖ్యమంత్రితో అన్నారు. గెట్ మై టైలర్, ‘గెట్ మై బుక్స్’, హైర్ పప్పీ, గ్లోసీ ట్రెండ్స్ అనే స్టార్టప్‌లను ప్రారంభించామని, ఈ స్టార్టప్స్ ద్వారా ఏడాదికి ఆరున్నర కోట్ల టర్నోవర్ అంచనావేస్తున్నట్లు జీబీఐ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ స్వప్న సిద్దార్ధ్ ముఖ్యమంత్రికి వివరించారు. 

గెట్ మై టైలర్ ఆన్ లైన్ స్టోర్ ద్వారా 5 వేల మదికి ఉపాధి లభిస్తోందని చెప్పారు.టైలరింగ్ వచ్చిన వాళ్లు ఎక్కడ వున్నా వారిలో నైపుణ్యాన్ని బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని, ఆర్ధికంగా వారికి తోడ్పడుతున్నట్లు తెలిపారు. గెట్ మై టైలర్ స్టార్టప్‌ను రాజమండ్రికి చెందిన తాడిమళ్ల కమలాకర్ ప్రారంభించారని, 241 మీటర్ల వస్త్రంతో అతడు 47 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పున్న చొక్కాను 4 రోజుల్లో తయారు చేశాడంటూ కమలాకర్‌ని ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. చొక్కా నమూనా చిత్రాన్ని, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సమర్పించిన యోగ్యతాపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయగా ఆయన అభినందించి వారికి ఇచ్చేశారు. సొంతగడ్డ మీద పరిపాలనకు నూతన శాసనసభా భవనం ద్వారా శ్రీకారం చుట్టినందుకు వారు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. గెట్ మై టైలర్ (www.getmytailor.com) ఆన్ లైన్ సర్వీసు ద్వారా 5 వేల మందికి ఉపాధి లభిస్తోందని, గెట్ మైబుక్స్ (www.getmybooks.com) స్టార్టప్ ద్వారా 6 లక్షల మంది విద్యార్ధులకు సేవలందిస్తున్నామని ప్రతినిధులు వివరించారు. హైర్ పప్పీ.కామ్ (www.hirepuppy.com) ద్వారా ఎవరైనా తాము కొనలేని వస్తువులను ఒకరోజు అద్దెకు తీసుకుని ఉపయోగించుకోవచ్చని వారు తెలిపారు. తమ స్టార్టప్‌లలో సభ్యురాలైన హిమవర్షిణి చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు అధికాదాయం పొందేందుకు తోడ్పడుతున్నారని వారు ముఖ్యమంత్రికి తెలిపారు. 

కోరుకున్న డిజైన్లతో చేనేత కార్మికులతో దుస్తులు తయారు చేయిస్తూ వారికి బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారని చెప్పారు.తాము కాకినాడ సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ సంపాదించటం ఎర్నింగ్ వైల్ లెర్నింగ్‘ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నామని వారు వివరించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆదిత్యవిద్యాసంస్థల అధిపతి ఎన్ శేషారెడ్డి తమను ఎంతో ప్రోత్సహించారని వారన్నారు. సీఎంను కలసినవారిలో గెట్ మై టైలర్- ఏన్ ఆన్‌లైన్ టైలరింగ్ సర్వీస్ (www.getmytailor.com) ప్రతినిధులు హర్షకొర్లపాటి, శశికాంత్ శ్రీరంగం, ఉన్నారు.