వీసాల విషయంలో అపోహలొద్దు : డొనాల్డ్‌ మల్లిగన్‌

వీసాల విషయంలో అపోహలొద్దు : డొనాల్డ్‌ మల్లిగన్‌

17-03-2017

వీసాల విషయంలో అపోహలొద్దు : డొనాల్డ్‌ మల్లిగన్‌

అమెరికాకు భారత్‌ అత్యంత ప్రధానమైన దేశమని యూఎస్‌ కాన్సుల్‌ ముఖ్య అధికారి డొనాల్డ్‌ మల్లిగన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌  ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో యూఎస్‌ కాన్సులేట్‌ సిబ్బందితో వీసా లపై అవగాహన సదస్సును విజయవాడలో ఏర్పాటు చేశారు. సదస్సులో మల్లిగన్‌, కాన్సుల్‌ అధికారి లూరెన్‌ వైన్‌లు మాట్లాడారు. అమెరికా విషయంలో అనవసర అపోహలొద్దని అన్నారు. వీసాల జారీ విషయంలో మరింత పారదర్శకంగా, సులభతరమైన పద్ధతులను అందుబాటులోనికి తెచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయాన్ని ఇప్పట్లో ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్న కార్యాలయాన్నే మరింత విస్తరిస్తున్నాం. నిత్యం వెయ్యి వీసాలు ఇచ్చే సామర్థ్యాన్ని 2500కు పెంచుతున్నాం అని అన్నారు. 

ఒక్కో కార్యాలయం ద్వారా కనీసం మూడు, నాలుగు రాష్ట్రాలకు సేవలందించే అవకాశముంది. అందువల్ల దగ్గర్లో మరో కార్యాలయం వచ్చే అవకాశం ఇప్పట్లో ఉండదు.  గతంలో ఎలా వీసాలను జారీ చేసేవారో, ఇప్పుడూ అదే జరుగుతోంది. ప్రస్తుతం నిత్యం 800 నుంచి వెయ్యి వీసాలను జారీ చేస్తున్నాం. ఈ విషయంలో అనవసర ఆందోళనలు అక్కర్లేదు.  ఆన్‌లైన్‌ ద్వారానే వీసా జారీ చేసే పద్ధతులు ప్రవేశపెట్టాం. బృందంగా అమెరికాకు వెళ్లాలన్నా అందరికీ కలిసి ఒకేసారి ముఖాముఖి నిర్వహించి అనుమతిస్తాం. భాషా సమస్యలు లేకుండా ఆంగ్లంతో పాటు తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లోనూ వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు. వీసా ఇంటర్వ్యూ, అమెరికాలో పరిణామాలు తదితర విషయాలను వెల్లడించారు.